నేడే వ్యవసాయ శాఖ భవనం ప్రారంభం
జహీరాబాద్: ఎట్టకేలకు జహీరాబాద్‌లోని వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయ భవనాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. ఎంపీ సురేష్ శెట్కార్ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రూ.61.50 లక్షల వ్యయంతో భవనాన్ని ఆరు నెలల క్రితం నిర్మించారు. అయినా ప్రారంభించే విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ విషయమై సెప్టెంబర్ 29వ తేదీన ‘సాక్షి’లో ‘ప్రారంభం ఎప్పుడో?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల్లో కదలిక వచ్చింది. భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ముహూర్తం నిర్ణయించారు. పాత భవనం శిథిలం కాడంతో విధులు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతూ వచ్చారు. దీంతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు 2022 జనవరి 30న అప్పటి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఇందుకోసం అప్పట్లో రూ.40 లక్షలు మంజూరు చేశారు. పూర్తిస్థాయిలో భవన నిర్మాణానికి నిధులు సరిపోక పోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రూ.21.50 లక్షల నిధులను మూడు విడతల్లో కేటాయించింది. దీంతో భవన నిర్మాణ పనులు గత ఆరు నెలల క్రితమే పూర్తి చేశారు. భవనం అందుబాటులోకి వస్తే డివిజన్ పరిధిలోని జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల్లోని రైతులకు సమావేశాల కోసం ఉపయోగపడనుంది. కనీస సదుపాయాలతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్, మండల వ్యవసాయాధికారి, ఆత్మ కమిటీ చైర్మన్ల కోసం ప్రత్యేకంగా గదులను నిర్మించారు. విధులు నిర్వహించే సిబ్బందికి సైతం ప్రత్యేక గది, సమావేశాలు జరుపుకునేందుకు వీలుగా పెద్ద హాల్ నిర్మించారు.
రూ.61.50 లక్షల వ్యయంతో నిర్మాణం
‘సాక్షి’ కథనంతో అధికారయంత్రాంగంలో కదలిక


