జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి అనిల్‌కుమార్
వట్పల్లి(అందోల్): తూకాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి అనిల్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం వట్‌పల్లిలోని సిద్ది వినాయక ధర్మకాంట వే బ్రిడ్జిని ఆయన తనిఖీ చేశారు. ఇటీవల కొనుగోలు చేసిన ధాన్యాన్ని వట్పల్లి మార్కెట్‌యార్డుకు తరలించే క్రమంలో లారీలను తూకం చేయగా ప్రతి లారీలో ధాన్యం తరుగుతో పాటు ఓ లారీలో ఏకంగా 150 సంచుల తరుగు రావడంపై రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారి ఆదేశాల మేరకు వే బ్రిడ్జిని తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తూకంలో తేడా లేదన్నారు. అయితే రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు వచ్చిందని చెబుతుండగా, మరోవైపు లీగల్ మెట్రాలజీ అధికారులు తూకంలో ఎటువంటి తేడాలు లేవని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులు పూర్తి విచారణ జరిపి నిజా నిజాలను వెలికి తీసి న్యాయం చేయాలని రైతులకు కోరుతున్నారు.


