సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా ప్రభుత్వ ఆస్ప త్రిలో వసూళ్లపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ’పైసాచికం’ కథనానికి అధికారులు స్పందించారు. ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు పలువురు సిబ్బందిపై తాత్కాలిక చర్యలు చేపట్టినట్లు ఆర్‌ఎంఓ రవికుమార్ తెలిపారు. ఆస్పత్రిలో జరుగుతున్న వాస్తవాలను వెలికితీసేందుకు ఒక ప్రొఫెసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఒక వైద్యుడితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే ముగ్గురు పేషంట్ కేర్ సిబ్బందిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు ఆర్‌ఎంఓ తెలిపారు. మరో పది మంది పేషంట్ కేర్ సిబ్బందిని పది రోజుల పాటు విధులకు దూరంగా ఉంచినట్లు వివరించారు. మరోవైపు ఆస్పత్రిలో జరుగుతున్న పరిణామాలపై ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, వారి కుటుంబ సభ్యుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్‌తో పాటు ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది వ్యవహారశైలి, డబ్బుల వసూళ్ల ఆరోపణలపై వివరాలు సేకరించారు. నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి సైతం సంబంధిత అధికారులను వివరణ కోరినట్లు సమాచారం. ప్రత్యేక కమిటీ నివేదికలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి? ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
ముగ్గురు పేషంట్ కేర్‌లపై తాత్కాలిక వేటు
రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు


