అప్రమత్తతే.. శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే.. శ్రీరామరక్ష

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 7:34 AM

సంగారెడ్డి: వానాకాలంలో వర్షాలతో పాటు పిడుగులు పడటం, వరద తాకిడికి వాగులు, వంకలు పొంగిపొర్లడం, విషసర్పాల సంచారం, విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అన్నదాతలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, వైద్యులు పేర్కొంటున్నారు. వానాకాలం ప్రారంభమై 10 రోజులు గడుస్తుంది. తొలకరి వర్షాలు కురవడంతో ఏ గ్రామంలో చూసినా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు అరకలు, వ్యవసాయ పనిముట్లతో పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

కరెంటుతో జర భద్రం

వానాకాలంలో విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్‌ వినియోగం తప్పనిసరి కావున పొలాలకు నీళ్లు పారించబోయే సమయంలో రైతులు ప్రమాదాలకు గురవుతుంటారు. స్టార్టర్ల బిగింపు, బోర్‌ మోటారు కనెక్షన్‌ మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర వర్షం పడిన సమయంలో వాటి దగ్గరకు వెళ్లొద్దు. రైతులు ఫీజు మార్చేందుకు నేరుగా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లరాదు. వ్యవసాయ మోటార్లు తడవకుండా చూసుకోవడంతోపాటు ఎర్తింగ్‌ ఉండాలి. మోటార్లకు విద్యుత్‌ సరఫరా చేసే సర్వీస్‌ వైర్లు భూమిపై ఉందొద్దు. సర్వీస్‌ వైర్లకు ఎట్టి పరిస్థితుల్లో జాయింట్లు లేకుండా చూడాలి. విద్యుత్‌పై పూర్తి అవగాహన లేని రైతులు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని విద్యుత్‌ అధికారులు సూచిస్తున్నారు.

మందుల పిచికారీ.. విష కీటకాలు..

పంటల సంరక్షణకు పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు రబ్బర్‌ బూట్లు వేసుకోవాలి. ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి. మందులను కర్రతో కలపాలి. భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మందులు స్ప్రే చేసే సమయంలో సిగరెట్లు, బీడీలు తాగకూడదు. ఎదురుగా గాలి వీచే సమయంలో పిచికారీ చేయవద్దు. వర్షాకాలంలో చెట్లు, గట్ల వెంట, గడ్డి వాములు ఉన్నచోట పాముల సంచారం అధికంగా ఉంటుంది. పొలానికి వెళ్లేటప్పుడు రైతులు చేతిలో కర్ర, రాత్రి అయితే టార్చిలైట్‌, కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్లాలి. ఒక వేళ పాము కాటు వేస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. నాటు వైద్యాన్ని నమ్ముకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.

వాగులు, వంకలతో..

వానాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు, వంకలు ప్రవహిస్తుంటాయి. నీటి ఉధృతిని అంచనా వేయలేని అన్నదాతలు వాగులు దాటుతూ కొట్టుకుపోయిన సందర్భాలున్నాయి. వర్షం వచ్చి వరదలొస్తే... నీటి ఉధృతిని గమనించాక అంచనాకు రావాలి. వాగులు, వంకలు దాటే సమయంలో ఒంటరిగా కాకుండా గుంపుగా దాటాలి. పశువులను దాటించే సమయంలో మరింత జాగ్రత్త అవసరం.

వానాకాలంలో పొంచి ఉన్న ప్రమాదాలు

కరెంటు మరమ్మతులు వద్దు

వర్షాలు పడేటప్పుడు జాగ్రత్త

రైతులు అప్రమత్తంగా

ఉండాలన్న నిపుణులు

పిడుగులు, మెరుపులతో ముప్పు

వర్షాలతో పాటు పిడుగులతోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఇప్పటికే అక్కడక్కడ పిడుగుపాటుకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే జాగ్రత్తలు తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆకాశంలో కారుమబ్బులు, మెరుపులు, ఉరుములు, వేగంగా గాలులు వీయడం లాంటివి పిడుగుపాటుకు సంకేతాలు. ఎత్తయినా ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, టెలిఫోన్‌ స్తంభాలపై, పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. అప్పడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఫోన్‌ను వెంటనే స్విచ్‌ఆఫ్‌ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మోకాళ్ల మధ్య తలవంచి రెండు చేతులతో చెవులు మూసుకుని, భూమి తగులకుండా వంగి కూర్చోవాలి. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ తీగలున్న ప్రాంతాల్లో ఉండరాదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement