చిన్నశంకరంపేట(మెదక్): క్షణికావేశంతో హత్య, ఆపై ప్రతీకార హత్యకు పాల్పడ్డారు. కన్నపేగు చివరి చూపునకు దూరమయ్యారు. ఒకరి అంత్యక్రియలు అర్ధరాత్రి జరిగితే, మరొకరి అంత్యక్రియలు ఊరుకాని ఊరులో నిర్వహించారు. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్ అంత్యక్రియలు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించారు. అయితే ఈ అంత్యక్రియలకు కన్నతండ్రి కిషన్, మేనమామ దూరమయ్యారు. శ్రీధర్‌ను హత్య చేసిన ప్రభాకర్ తండ్రి యాదగిరిని ప్రతీకారంతో హత్యచేసి పోలీసులకు చిక్కడంతో వారు స్టేషన్‌లో ఉన్నారు. అలాగే యాదగిరి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఊరుకాని ఊరు నర్సాపూర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు కుమారుడు ప్రభాకర్, కూతుర్లు దూరమయ్యారు. సోదరులు, పాలివారు నర్సాపూర్ వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సూరారం గ్రామంలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో ప్రతీకార దాడులు జరగవచ్చనే భయంతో యాదగిరి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు వెనకాడారు. క్షణికావేశంతో వరుసగా జంట హత్యలకు పాల్పడడం, కనీసం కన్నవారి కడచూపునకు దూరమవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా గ్రామంలో పోలీసుల పికెట్ కొనసాగుతుంది.
తల్లడిల్లిన కన్నపేగు
ఊరుకాని ఊరులో అంత్యక్రియలు
సూరారంలో కొనసాగుతున్న పికెట్


