కడుపునొప్పి భరించలేక బాలుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక బాలుడి ఆత్మహత్య

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 7:34 AM

నర్సాపూర్‌: కడుపునొప్పి భరించలేక బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం... నర్సాపూర్‌కు చెందిన లక్ష్మిప్రసన్న, ప్రవీణ్‌ కుమార్‌గౌడ్‌ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో రెండో కుమారుడు హర్షవర్ధన్‌గౌడ్‌(15)కు పుట్టుకతోనే కిడ్నీ సంబందిత సమస్య ఉంది. దీంతో ఐదు నెలల నుంచి కడుపునొప్పి రావడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇదిలాఉండగా లక్ష్మిప్రసన్న తన పెద్ద కుమారుడు శ్రీవాత్సవ్‌ ఎఫ్‌సెట్‌ పరీక్ష సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం అతనితో పాటు బుధవారం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో హర్షవర్ధన్‌ ఉరివేసుకున్నాడు. కాగా అతని మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

దైవదర్శనానికి వద్దన్నందుకు..

సిద్దిపేటఅర్బన్‌: దైవదర్శనానికి తనను వద్దన్నారని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కానుగంటి మురళి, బాలలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండవ కుమారుడు రాహుల్‌ (18) పదవ తరగతి వరకు చదువుకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడు తిరుపతి దైవదర్శనానికి వెళ్తుండగా, తాను కూడా వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో తమ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని, అన్న వెళ్లి వస్తాడని చెప్పడంతో మనస్తాపం చెందాడు. మంగళవారం రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు. బుధవారం ఉదయం చూసేసరికి ఇంట్లో కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికారు. సాయంత్రం పక్క పొలం వారు ఫోన్‌ చేసి వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినట్టు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement