హత్నూర (సంగారెడ్డి)/సంగారెడ్డి క్రైమ్: వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతం, గ్రామాల్లోని వ్యవసాయ పొలాలతో పాటు దట్టమైన పొదల సమీపంలో పాములు కనిపిస్తుంటాయి. కాగా కొన్ని రోజుల క్రితం హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో విద్యార్థిని పాముకాటుకు గురై చనిపోయింది. ప్రతి ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు పాములు, ఇతర విష కీటకాల సంచారం ఎక్కువగా ఉంటుంది. అలాగే పొలాల్లో పిచ్చి మొక్కలు పెరుగుతుండడంతో ఎక్కువ ఏ విషపురుగు ఉందో గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. అయితే జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
విష పాముల పట్ల నిర్లక్ష్యం వద్దు..
విషపూరిత పాములు పంట పొలాల్లో సంచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాములు ఎలుకలను, కప్పలను తినేందుకు బయట తిరుగుతూ చెట్లపొదల్లో ఉంటాయి. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉంటూ ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. ముఖ్యంగా పాము కాటు వేసినప్పుడు రెండు లేదా నాలుగు గుర్తులు పడతాయి. అరగంటలోపు పాము విషం శరీరంలో పూర్తిగా పాకిపోతుంది. కళ్లు మూతలు పడటం, చేతులు, కాళ్లకు తాత్కాలికంగా పక్షవాతం రావడం, మాట ఆగిపోవడం, నాలుకకు రుచి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రథమ చికిత్స తప్పనిసరి
పాము కాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. పాము కాటు వేసిన భాగాన్ని ఎక్కువగా కదిలించరాదు. ఆ భాగాన్ని బట్టతో లేదా టవల్‌తో గట్టిగా కట్టాలి. ఇలా చేయడం వల్ల విషం శరీరంలోకి వ్యాపించదు. సాధ్యమైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు విషానికి విరుగుడుగా యాంటీ వీనం ఇస్తారు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
అన్ని పాములు విషం కాదు
మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నాగుపాము, కట్లపాము , రక్తపింజర, వంటి పాములు వల్లే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా 50% పైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.
ఏమరుపాటుగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం
పాము కాటుకు గురైతే
నాడీ వ్యవస్థపై ప్రభావం
జాగ్రత్తలు తీసుకోవాలన్న వైద్యనిపుణులు
అప్రమత్తత అవసరం
పాము నుంచి రక్షించుకునేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. పాము కాటుకు గురైతే యాంటీ వీనం మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో పొలం వద్దకు వెళ్లే రైతులు కాళ్లకు చెప్పులు వేసుకొని, భారీ శబ్దాలు చేస్తూ టార్చ్‌లైట్ వెంట తీసుకెళ్లాలి.
– వినోద్, వైద్యుడు, సంగారెడ్డి


