సీఎం నాయకత్వంలో
70 శాతం హామీలు అమలు
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
ప్రతిఓటును కాపాడాలి: మంత్రి దామోదర
జోగిపేట/వట్‌పల్లి(అందోల్): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పనైపోయిందని పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. అందోలు మండలం అల్మాయిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం బీఎల్‌ఏలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సహకారంతో 2023లో అధికారంలోకి వచ్చి సీఎం రేవెంత్‌రెడ్డి నాయకత్వంలో 70 శాతం వాగ్దానాలను నెరవేర్చామని చెప్పారు. ఉచిత బస్సు పథకం నుంచి సన్న బియ్యం వరకు హామీలను అమలు చేశామని తెలిపారు. కానీ కేటీఆర్, హరీశ్‌రావు సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన నీళ్లు, భూ దోపిడీలు, అక్రమాలు ప్రజలు మర్చిపోయి మళ్లీ మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే భ్రమే అవుతుందని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.23 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినట్టు గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో 70 శాతానికి పైగా కుటుంబాలు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందుతున్నారన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి సి.దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా భర్తీచేసి అందరూ అందజేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. వలస కూలీలు, వయో వృద్ధులు, నిరక్షరాస్యులు, రైతుల ఓట్లు తొలగించే అవకాశం ఉందని, బీఎల్‌ఏలు ఓట్లు పోకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావద్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, పీసీసీ ఉపాధ్యాక్షుడు సంఘమేశ్వర్, మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్‌లు ఎస్.కృష్ణారెడ్డి, ఎ.చిట్టిబాబు పాల్గొన్నారు.


