హక్కుపై దాడిని తిప్పికొడదాం ప్రతీకార్యకర్త అప్రమత్తంగా ఉండాలి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ అందోలు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌పై శిక్షణ
వట్‌పల్లి(అందోల్): ఓటు హక్కు కోల్పోయినట్లయితే ఆ వ్యక్తి మానవ హక్కులను కోల్పోయినట్లేనని, పేదవాడు ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ అన్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని అల్మాయిపేట లక్ష్మిదేవి గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ పై బీఎల్‌ఏలకు అవగాహన,శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయానికి తెరలేపిందని ఆరోపించారు. బెంగాల్‌లో 30 లక్షల ఓట్లను తొలగించారని, దీని వల్ల మమతా బెనర్జీ ఓటమికి బీజేపీ కారణమైందని విమర్శించారు. ఇప్పుడు ఓటు హక్కు కోల్పోతే ఐదేళ్ల వరకు పొందే అవకాశం లేదన్నారు. తెలంగాణను మరో బెంగాల్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రజలు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎస్‌ఐఆర్, ప్రక్రియ ద్వారా ఓటు హక్కును తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బూత్ లెవెల్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, ప్రతి ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని, అవసరమైన ఫారాలను నింపించి ఓటర్ల హక్కులను కాపాడాలని కోరారు.


