● మల్టీ జోన్ డీఐజీ –7 ఎల్‌ఎస్ చౌహన్ ● ఎస్పీ కార్యాలయం సందర్శన
సంగారెడ్డి జోన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారానే కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయవచ్చని మల్టీజోన్ డీఐజీ 7 ఎల్‌ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి కేసు వివరాలను ఎప్పటికప్పుడు ’సీసీటీఎన్‌ఎస్’లో నమోదు చేస్తూ డేటా నాణ్యతను పెంచాలని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీసు సిబ్బంది పిల్లల పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు.
స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా కల్పించాలి
హత్నూర(సంగారెడ్డి): పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకొని వారికి భరోసా కల్పించేలా పోలీస్ అధికారులు పనిచేయాలని డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ అన్నారు. మంగళవారం హత్నూర పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేయాలని సూచించారు. మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తనిఖీల్లో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ రమణారెడ్డి ,ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


