ముంగిట్లోకే విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

ముంగిట్లోకే విత్తనాలు

Jun 23 2026 7:55 AM | Updated on Jun 23 2026 7:55 AM

అందరి భాగస్వామ్యం

50 రైతు వేదికల్లో విక్రయ కేంద్రాలు అందుబాటులో ఏడు సన్నరకాల వడ్లు.. సోయాబీన్‌, కంది, మినుము, పెసర, కూరగాయ విత్తనాలు పంటల మార్పిడిపై రైతులకు విస్తృత అవగాహన

విత్తనాలు ఇవే...

వానాకాలం పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం సూచించిన విత్తనాలను వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ప్రభుత్వం సబ్సిడీ అందించనున్న ఏడు ప్రాధాన్యత సన్న రకాల వడ్లు అయిన బీపీటీ–5204, తెలంగాణ సోన, పీఎన్‌ఆర్‌–15048, కేఎన్‌ఎం–1638, జైశ్రీరామ్‌ సెగ్మెంట్‌, హెచ్‌ఎంటీ సోన, డబ్ల్యూజీఎల్‌–44, కేఎన్‌ఎం–7715తో పాటు పప్పుధాన్యాలు కంది, మినుము, పెసరతో పాటు సోయాబీన్‌, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాల నాణ్యమైన నిల్వలు అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా నానో యూరియా, డీఏపీని ప్రదర్శిస్తారు. వాటి గురించి రైతులకు డీలర్లు అవగాహన కల్పిస్తారు.

వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న వేళ విత్తన మేళా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. మంగళవారం నుంచి వారం పాటు జిల్లాలోని 50 రైతు వేదికల్లో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పంటల మార్పిడిపై రైతులకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. – జహీరాబాద్‌

వారం రోజుల పాటు మేళా నిర్వహించి అవసరమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. రైతులు విత్తనాల కోసం పట్టణ కేంద్రాలకు పరుగులు పెట్టకుండా ఉండేందుకు డీలర్లనే గ్రామాలకు పంపించేలా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి మండలంలోని రెండు నుంచి మూడు రైతు వేదికల్లో డీలర్లు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచుతారు. రైతు వేదిక పరిసర గ్రామాల రైతులు అక్కడికు వెళ్లి తమకు కావాల్సిన విత్తనాలను కొనుగోలు చేసుకునే సౌలభ్యం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా 50 రైతు వేదికల్లో విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. కార్యక్రమం విజయవంతం చేసే బాధ్యతలను ఏడీఏలకు అప్పగించారు.

కార్యక్రమం ప్రారంభం రోజున ప్రజా ప్రతినిధులు, సబంధిత శాఖల అధికారులు, ప్రగతి శీల రైతులను భాగస్వాములను చేస్తారు. విత్తన మేళా ప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. రైతుల గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. ఈ సందర్భంగా ఏఈఓలు రైతులకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు, పంట వైవిధ్యం, నాణమైన విత్తనాల లభ్యత, ఎల్‌నినో ప్రభావం కారణంగా వేసుకోవాల్సిన పంటలపై అవగాహన కల్పిస్తారు. కార్యక్రమం సమయంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతుల వివరాలను ఓఎల్‌ఎంఎస్‌ పోర్టర్‌లో తప్పని సరిగా నమోదు చేయాలి.

నేటి నుంచే విత్తన మేళా

సద్వినియోగం చేసుకోవాలి

రైతుల సౌలభ్యం కోసం వారం రోజులు విత్తన మేళా నిర్వహించనున్నాం. జిల్లాలోని 50 రైతు వేదికల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. డీలర్లు విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అనుమానాలను వ్యవసాయ శాఖ అధికారులు నివృత్తి చేస్తారు. –శివప్రసాద్‌,

జిల్లా వ్యవసాయాధికారి, సంగారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement