ఆదర్శంగా బూచినెల్లి సర్పంచ్
జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ బడులను బలోపే తం చేసేందుకు పలువురు ప్రజాప్రతినిధులు విశేష కృషి చేస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పిస్తున్నారు. మండలంలోని బూచినెల్లి సర్పంచ్ అలిగే సునీత కూడా గ్రామంలోని సర్కారు బడిలో తన కూతురిని చేర్పించి ఆదర్శంగా నిలిచారు. సోమవారం పాఠశాలలో అక్షరాభాస్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకే రోజు 15 మంది పిల్లలు పాఠశాలలో చేరారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యఅందుతుందని, అందరూ సర్కారు బడికి పంపాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ మాణయ్య, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మొలకెత్తిన పత్తి
మునిపల్లి(అందోల్): ఖరీఫ్ సీజన్‌లో పత్తివిత్తనాలు నాటిన రైతులకు అదపాదడపా కురిసిన వర్షాల వల్ల మొలకెత్తాయి. మరికొందరు రైతులు పత్తి విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సరైన సమయంలో వర్షం పడితెనే పత్తి మొలకెత్తి ఎదుగుదలకు వస్తుందని రైతులు చెప్తున్నారు. సమయానికి వర్షం కురవకపోతే నాటిన విత్తనాలు కూడా మొలకెత్తని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు
కేంద్రాల్లోనే జొన్నలు
రాయికోడ్(అందోల్): మండలంలోని నల్లంపల్లి, ఇందూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్నలు ఇంకా కేంద్రాల్లోనే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి లారీల కొరత వల్ల సకాలంలో కేంద్రాల నుంచి ప్రభుత్వ గిడ్డంగులకు జొన్నలను పంపడంలో జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. నల్లంపల్లి సొసైటీ ద్వారా 8,600 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయగా ఇంకా 2 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉన్నాయి. ఇందూర్ సొసైటీ ద్వారా 10 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేయగా 1,200 క్వింటాళ్ల జొన్నలు కేంద్రంలోనే ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో గోడౌన్‌లకు పంపిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. జొన్నలు విక్రయించిన రైతులు మాత్రం డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
అక్రమ లే అవుట్లపై
చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
కొండాపూర్(సంగారెడ్డి): పుట్ట గొడుగుల్లా అక్రమ వెంచర్లు అనే కథనం సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పందించారు. ఈ మేరకు కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అక్రమంగా వెలిసిన వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ సర్వే నంబర్ 158లో వెలిసిన వెంచర్‌కి ఎలాంటి అనుమతులు లేకున్నా.. ప్లాట్లుగా విభజించారన్నారు. అలాగే ఇళ్లు నిర్మించి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అధికారులు మౌనంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించి తక్కువ ధరకే అంటూ ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వెంచర్‌కు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
యూరియా పంపిణీ
కల్హేర్(నారాయణఖేడ్): బాచేపల్లి పీఏసీఎస్‌లో సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. పర్సన్ ఇన్‌చార్జి సంగారెడ్డి మాట్లాడు తూ వానకాలం పంటల సాగు కోసం యూరియా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.
బీఎల్‌ఓలకు అవగాహన
కల్హేర్(నారాయణఖేడ్): కల్హేర్, సిర్గాపూర్‌లో సోమవారం బీఎల్‌ఓలకు అవగాహన కల్పించారు. తహసీల్దార్లు శివశ్రీనివాస్, కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ద్వారా ఓటర్ల పేర్లు మ్యాపింగ్ చేసే విధానంపై సూచనలు చేశారు.


