● ప్రతీ సమాచారం ఇక అరచేతిలోనే.. ● సేవలు ప్రారంభించిన విద్యాశాఖ ● త్వరలో పూర్తి స్థాయిలో విస్తరణ
నారాయణఖేడ్: సర్టిఫికెట్లు, ఇతర సేవల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే రోజులు ముగిసిపోయాయి. సాంకేతికతను సామాన్యుడి ముంగిట్లోకి తెస్తూ రాష్ట్ర విద్యాశాఖ డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా సేవలు అందించనున్నారు. విద్యార్థులకు తమకు అవసరమైన సేవలను ఇక ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లోనే పొందనున్నారు. ఈ సౌకర్యంతో వేలాది మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది.
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
ఈ విద్యాసంవత్సరం నుంచే సేవలను అమలులోకి తెస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే అమలు చేసింది. నాలుగు రోజుల క్రితం అధికారికంగా ప్రారంభించింది. కేవలం ఒక వాట్సాప్ సందేశంతో విద్యార్థులు తమ విద్యా పురోగతిని తెలుసుకోవడమే కాకుండా అవసరమైన ధ్రువపత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,265 ఉండగా, ఇందులో సుమారు 92 లక్షల మది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 10 మోడల్ స్కూల్స్‌లో 6,495 మంది, 22 కేజీబీవీల్లో 4,975, 11 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,596, 4 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 761, 7 గిరిజన సొసైటీ పరిధిలోని గురుకులాల్లో 3,387, 11 బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 5,456, 12 మైనార్టీ గురుకులాల్లో 4,916, 4 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 931 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు.
అందనున్న సేవలు..
విద్యార్థులకు ప్రస్తుతం కొన్ని రకాల సేవలు తక్షణం అందుతుండగా, మిగిత సేవలను అతి త్వరలో అందుబాటులోకి తసుకురానున్నారు. టెన్త్ మార్కుల మెమోలు, బోనాఫైడ్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, విద్యార్థులు ప్రొగ్రెస్ కార్డులు, హాల్‌టికెట్ డౌన్‌లోడ్, ఫలితాల సమాచారం, మోమోల్లో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రెండో దశలో యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు శాతం, ప్రీ–మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజనం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహ పాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమ వివరాలు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ వివరాలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను సేకరించి ఇప్పటికే యాక్టివేట్ చేశారు.
పాలపిట్ట డిజిటల్ మస్కట్
విద్యాశాఖ, మీసేవ సహకారంతో వాట్సాప్ ఆధారిత పాఠశాల సేవలు పొందేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్‌గా ఎంపిక చేసింది. యానిమేషన్ రూపంలో ఉండే ఈ పాలపిట్ట విద్యార్థులకు సంక్లిష్టమైన సమాచారాన్ని సులభతరమైన వీడియోల ద్వారా వివరించనుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ఈ వాట్సాప్ సేవలు వారధిలా పనిచేయనున్నాయి.


