బదిలీ అయినా వెళ్లనంటున్న తాత్కాలిక ఉద్యోగి
● పటాన్‌చెరు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో అక్రమాలు ● ఆరోపణలపై విచారణ
పటాన్‌చెరు: బదిలీ అయినా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అక్కడే విధులు నిర్వహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా ఆమె అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జులు మాత్రం రెండేళ్లకు ఒకరు మారుతున్నారు. కానీ ఆ ఉద్యోగి మాత్రం నెలవారీ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అందరికీ వాటాలు పంచుతున్నారు. కారణాలేమైనా ఆమెను కదిలించే సాహసం ఎవరూ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆమెకు బదిలీ ఉత్తర్వులు అందినా తాను ఇక్కడి నుంచి కదలనంటుండటంతో రేషన్ డీలర్ల సైతం విస్తుపోతున్నారు.
40 మంది డీలర్లకు బియ్యం సరఫరా
ప్రతి నెల పటాన్‌చెరు (ఎంఎల్‌ఎస్ పాయింట్) గోదాం నుంచి రేషన్ డీలర్లకు బియ్యం ఇతర సరుకులను సరఫరా చేస్తుంటారు. అయితే అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జిలు ఎంత సరుకు వచ్చింది, ఎంత డెలివరీ అయ్యిందనే వివరాలను నమోదు చేస్తుంటారు. పటాన్‌చెరు పట్టణంలో 17 మంది రేషన్ డీలర్లతో పాటు పటాన్‌చెరు మండల స్థాయి స్టాక్(ఎంఎల్‌ఎస్) పాయింట్ నుంచి దాదాపు 40 మంది డీలర్లకు బియ్యం ఇతర సరుకులు సరఫరా చేస్తుంటారు.
తరుగు పేరుతో నల్లబజారుకు..
కాగా గోదాంలో వచ్చిన లారీల నుంచి బియ్యం బస్తాలు దించినట్లు లెక్కలు చూపుతారు. కానీ హమాలీకి ఒక్క రూపాయి ఇవ్వకుండానే లారీల్లో వచ్చిన బియ్యం తరలిపోతుంటుంది. ఎలాంటి తూకం లేకుండా సరఫరా జరుగుతుంది. రేషన్ డీలర్లకు ఖాళీ సంచులకు బదులుగా చూపాల్సిన బియ్యం లెక్కలు, తరుగు పేరుతో జరిగే దోపిడీతో సరాసరి ప్రతి నెల దాదాపు పది టన్నులు అంటే ఓ లారీ బియ్యం నల్ల బజారుకు తరలుతుంది. దాన్ని విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ఆ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నతాధికారులకు కూడా అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు..
మొత్తం మీద ఆమె తీరుతో ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు, ఆ డీఓను బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గోదాంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను బదిలీ చేయాలని డీలర్లు ఎమ్మెల్యేకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన స్వయంగా ఓ లేఖ కూడా ఇచ్చారు. ఆమైపె వచ్చిన ఆరోపణలతో బదిలీ చేశారని, అయినా ఆమె ఆ స్థానాన్ని వదలకుండా ఉండేందుకు తాజాగా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.
బదిలీ చేశాం
పటాన్‌చెరు ఎంఎల్‌ఎస్ డాటా ఎంట్రీ ఆపరేటర్‌పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్నాం. ఇదివరకే చర్యలు తీసుకున్నాం. ఆమెను బదిలీ చేశాం. రెండు రోజుల క్రితమే జిల్లా అదనపు కలెక్టర్ ఆమె బదిలీ ఉత్తర్వులను వెలువరించారు. ఆమె అక్కడి నుంచి బదిలీ అయిన స్థానంలోకి వెళ్లాల్సిందే. కాదని పైరవీలు చేస్తే చూస్తూ ఉపేక్షించేది లేదు.
– జయశ్రీ, జిల్లా మేనేజర్,
పౌరసరఫరాల శాఖ, సంగారెడ్డి


