జిన్నారం (పటాన్ చెరు): ఉమ్మడి జిన్నారం మండలంలో ప్రభుత్వాస్పత్రులు నిర్మించి మూడేళ్లు గడిచినా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పలు పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు, స్థానిక ప్రజలు అనారోగ్యం పాలైతే వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. కాగా గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, కాజిపల్లి ప్రాంతాల పారిశ్రామిక వాడలోని పరిశ్రమల్లో ఉపాధి కోసం బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు రసాయన పరిశ్రమల్లో పని చేస్తూ సమీప ప్రాంతాల్లో నివాసముంటారు. కానీ వారికి సుస్తీ చేస్తే వైద్య సేవలు మాత్రం అందని ద్రాక్షగా మారాయి.
ఉమ్మడి మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, బస్తీ దవాఖానలు ఉన్నా, గడ్డపోతారం పారిశ్రామికవాడలో అసలు వైద్య సేవలు అందించేందుకు దవాఖానలు ఇప్పటివరకు ఏర్పాటుకు నోచుకోలేదు. ప్రధానంగా పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో క్షతగాత్రులను వైద్యం కోసం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం పారిశ్రామికవాడలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడం శోచనీయం. దగ్గు, జ్వరం, జలుబు వంటివి వస్తే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్మికుల నెల వేతనంలో సగభాగం వైద్య ఖర్చులకే సరిపోతుంది.
మంత్రికి వినతి..
కొంతకాలంగా పారిశ్రామికవాడలో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కార్మిక శాఖ మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హాజరయ్యారు. ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని మంత్రికి స్థానిక నాయకులు వినతిపత్రం అందజేయగా ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆస్పత్రుల ప్రారంభమెప్పుడో?
కార్మికులకు అందని వైద్య సేవలు
అనారోగ్యం బారిన పడితే ప్రైవేటు ఆస్పత్రికే..
జిన్నారం, నల్తూరులో దవాఖానాల నిర్మాణం పూర్తి
మూడేళ్లయినా ప్రారంభానికి నోచుకోని దైన్యం
జిన్నారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నూతన భవనాన్ని నిర్మించింది. భవన నిర్మాణం పూర్తయి మూడేళ్లకు పైబడినా ప్రారంభానికి నోచుకోలేదు. అలాగే పట్టణ పరిధిలోని నల్తూరు గ్రామంలో పల్లె దవాఖానను నిర్మించి, ప్రారంభించడం మరిచారు. దీంతో స్థానిక ప్రజలు వైద్య సేవలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.
నల్తూర్‌లో నిర్మాణం పూర్తయినా
ప్రారంభానికి
నోచుకోని
బస్తీ దవాఖాన


