మెదక్‌జోన్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసిన ఘటనలో భర్తకు న్యాయస్థానం సోమవారం జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కథనం ప్రకారం... మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు మండలం కమలాపురం గ్రామానికి చెందిన లక్ష్మికి 20 ఏళ్ల క్రితం రేగోడ్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన కూతూరి కేశయ్యతో వివాహం జరిగింది. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. కాగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కేశయ్య ఎనిమిదేళ్ల క్రితం ఆమె నుంచి విడిపోయాడు. అనంతరం లక్ష్మి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను పోషించుకుంటూ జీవనం సాగించింది. ఈ నేపథ్యంలో 2023 జనవరి 16న మేనమామను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా, వాగు సమీపంలో కాపుకాసిన కేశయ్య ఆటోను అడ్డగించి, ఆటో డ్రైవర్‌ను కత్తితో బెదిరించి పంపించాడు. అనంతరం లక్ష్మిపై కత్తితో దాడి చేసి హత్య చేయడంతో పాటు, ఆమె అక్కపై కూడా దాడి చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
జేసీబీకి నిప్పు..
చిన్నశంకరంపేట(మెదక్): తన కబ్జాలో ఉన్న భూమిలో వద్దన్నా వినకుండా చదును చేస్తున్నారని ఆగ్రహించిన రైతు జేసీబీకి నిప్పుపెట్టాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట గ్రామశివారులో ఓ రైతు స్వాధీనంలో ఉన్న భూమిని తాను కొనుగోలు చేశానని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి జేసీబీతో చదును చేసేందుకు పనులు మొదలు పెట్టాడు. రెండు రోజుల క్రితం పనులు నిలిపివేసిన రైతు సర్వే జరిగే వరకు పనులు చేయవద్దని కోరాడు. సోమవారం రైతు తనకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లి వచ్చేలోపు జేసీబీతో పనులు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతు జేసీబీకి నిప్పు పెట్టాడు. వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా, మెదక్ ఫైర్‌సిబ్బంది వచ్చి మంటలార్పారు.


