చేగుంట(తూప్రాన్): సినీ ఫక్కీలో వ్యక్తిని ఆటోతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘటన మండలంలోని అనంతసాగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాట శ్రీధర్(30) వ్యవసాయంతో పాటు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌కు పొలం లేకపోవడంతో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. కాగా వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా ఆటో కిస్తీ డబ్బులు చెల్లించే విషయంలో మనస్పర్దలు ఏర్పడ్డాయి. రెండు నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో ఇద్దరు ఒకరినొకరు చంపుకొనే స్థాయిలో గొడవపడ్డారు. గ్రామస్తులు జోక్యం చేసుకొని శాంతింప జేశారు. సోమవారం శ్రీధర్ చేగుంట నుంచి బైకుపై బోనాల రోడ్డు వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనంతసాగర్ శివాజీ విగ్రహం వద్ద శ్రీధర్ బైకుకు ఆటో అడ్డురాగా మరో ఆటో అతడ్ని ఢీకొట్టింది. కాగా ఆటోలో నుంచి దిగిన వ్యక్తులు కిందపడిపోయిన శ్రీధర్ తలపై కొట్టి, చనిపోయాడనుకున్న తరువాత దుండగులు వచ్చిన ఆటోలోనే పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీధర్‌ను ప్రభు(ప్రభాకర్) హత్య చేశాడని, అతడిని అరెస్టు చేసే వరకు మృతదేహం తరలించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. వినకపోవడంతో స్వల్ప లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
మృతుడి బంధువుల ఆందోళన


