తొగుట(దుబ్బాక): యువత మత్తు జోలికి వెళ్లొద్దని సీపీ సాధన రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గుడికందులలో మన పోలీస్–మన ఊరు కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలు, గ్రంథాలయాన్ని సర్పంచ్ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన గంజాయి, మత్తు పదార్థాలు నేడు పట్టణాలకు చేరాయన్నారు. యువత వాటి బారిన పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ క్రీడలను ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్‌లు, విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్మెట్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ పర్శరాములు, ఎంఈవో నర్సయ్య, బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి విభీషన్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, అదనపు సీపీలు వెంకట్‌రెడ్డి, సుభాష్ చంద్రబోస్, కుషాల్కర్, హెచ్‌ఎం అంజిరెడ్డి, ఐకేపీ ఏపీఎం బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీపీ రష్మీ పెరుమాళ్


