● వర్షంతో పంటలకు ప్రాణం ● విత్తనాలు విత్తుకోవడంలో రైతులు బిజీ
న్యాల్‌కల్(జహీరాబాద్): కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. సాగుకు సన్నద్ధమవుతున్న రైతులతోపాటు సాగు చేసుకున్న వారు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజులుగా వర్షాలజాడ లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. సాగు చేసుకున్న పంటలకు ప్రాణం పోసినట్లు కాగా, వేసే పంటలకు పరిస్థితులు అనుకూలంగా మారాయి.
2.70లక్షలు ఎకరాల్లో పంటల సాగు
అకాల వర్షాలతో పాటు జూన్ ప్రారంభంలో కురిసిన కొద్ది పాటి వర్షాలకు కొంత మంది రైతులు విత్తనాలను విత్తుకోగా మరి కొంత మంది రైతులు వేచి చూసే ధోరణిని అవలంబించారు. జిల్లాలో 2.70లక్షలు ఎకరాల్లో పంటలు సాగు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా 1.70 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసుకున్నారు. సాగు చేసుకున్న పంటల్లో కొన్ని మొలకెత్తగా మరి కొన్ని కుళ్లిపోయి మొలకెత్తలేదు.
14 మిల్లీ మీటర్ల వర్షం
గత వారం రోజులుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవగా రాత్రి అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 14.1 మి.మీ వర్ష పాతం నమోదైంది. ఝరాసంగంలో 54.3, కొండాపూర్‌లో 35.2, న్యాల్‌కల్‌లో 30.0, కోహీర్‌లో 22.3, సిర్గాపూర్ మండలాల్లో 20.0 మిల్లీ మీటర్ల అధిక వర్షపాతం నమోదు కాగా నిజాంపేట్, అమీన్‌పూర్, నారాయణఖేడ్, హత్నూర, ఆర్‌సీపురం, జహీరాబాద్, మొగుడంపల్లి తదితర మండలాల్లో తక్కువ వర్ష పాతం నమోదైంది. పంటలు సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


