రైతుల మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతుల మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

టీజీటీపీసీ మాజీ చైర్మన్‌ మఠం భిక్షపతి

వట్‌పల్లి(అందోల్‌): వానాకాలం సాగు పంటలు మొదలైనా రైతులకు రైతు భరోసా సాయం అందించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నోటి మాటలతో కాలం వెళ్లదీస్తూ రైతులను మోసం చేస్తోందని రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మఠం భిక్షపతి మండిపడ్డారు. స్థానిక విలేకరులతో ఆదివారం మాట్లాడుతూ..నాడు కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీజన్‌ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేసేవారన్నారు. ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎరువుల సరఫరా దారుణంగా తయారైందన్నారు. తక్షణమే అర్హులైన రైతులందరికీ ‘రైతు భరోసా’డబ్బులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఫీజు బకాయిలు

విడుదల చేయాలి

రాజ్యసభ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

సంగారెడ్డి: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్‌భవన్‌లో గల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్‌.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను త్వరగా విడుదల చేయాలన్నారు. 28వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని చెప్పడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను చదువులకు దూరం చేయడం ప్రైవేట్‌ పాఠశాలకు ప్రభుత్వమే ప్రోత్సహించినట్లు అవుతుందని మండిపడ్డారు. బీసీ సంఘం తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌

బాటలోనే టీఆర్‌ఎస్‌

సంగారెడ్డి జిల్లా పార్టీ ఇన్‌చార్జి బాలయ్య

జోగిపేట(అందోల్‌): ప్రొఫెసర్‌ జయశంకర్‌ చూపిన బాటలోనే మాజీ ఎమ్మెల్సీ కవిత స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీ నడుస్తుందని సంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి బాలయ్య తెలిపారు. ఆదివారం జోగిపేటలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం హనుమాన్‌ చౌరస్తాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆయన తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని గుర్తు చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement