ఐబీ భవనం.. అధ్వానం | - | Sakshi
Sakshi News home page

ఐబీ భవనం.. అధ్వానం

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల కేంద్రమైన శివ్వంపేటలో ఐబీ భవనం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. లక్షలు వెచ్చించి తూప్రాన్‌– నర్సాపూర్‌ హైవే పక్కన శివ్వంపేటలో నిర్మించిన ఐబీ భవనం నిరుపయోగంగా మారింది. సంబంధిత శాఖ భవనం వినియోగించకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి ప్రజా అవసరాల నిమిత్తం భవనంను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎంపీకి వినతి

నిజాంపేట(మెదక్‌): మండల పరిధిలోని నార్లాపూర్‌ గ్రామానికి నిధులు విడుదల చేయాలని ఎంపీ రఘునందన్‌ రావుకు వార్డు సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఆదివారం ఆయన ను కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో అత్యవసరంగా అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు కోసం మొత్తం రూ. 40 లక్షల నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని ప్రవీణ్‌ కుమార్‌, సంజీవులు, మల్లేశం, పురుషోత్తం పాల్గొన్నారు.

ధాన్యం విషయంలో తప్పుడు ఆరోపణలు

తూప్రాన్‌: కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇచ్చినా రేవంత్‌రెడ్డి సర్కారు బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం తూప్రాన్‌ మున్సిపల్‌ రెండవ కౌన్సిలర్‌ చందా అశోక్‌ యాదవ్‌ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధాన్యానికి, బియ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన ప్రభుత్వం అవగాహన లేమితో బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు.

స్క్రాప్‌ షాప్‌ యజమానికి జరిమానా

మెదక్‌ కలెక్టరేట్‌: పట్టణంలోని 12వ వార్డులో రోడ్డుపై చెత్తవేసి తగులబెట్టినందుకు మున్సిపల్‌ శానిటేషన్‌ అధికారులు స్క్రాప్‌ షాపు నిర్వాహకుడికి ఆదివారం రూ.3వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా శానిటేషన్‌ అధికారులు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఎవరైనా చెత్తను రోడ్లపై గాని, ఖాళీ స్థలాల్లో గాని వేసి తగలబెట్టినట్టు మా దృష్టికి వస్తే వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రోడ్లపై, మురుగు కాల్వల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయొద్దని సూచించారు. ఇంటి వద్దకు వస్తున్న మున్సిపల్‌ వాహనాలకు అందజేయాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రజలు తమ వంతు బాధ్యత నిర్వహించాలని కోరారు.

ఓవర్‌ లోడ్‌ వాహనాల సీజ్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలో ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను గుర్తించి సీజ్‌ చేసినట్లు, జిల్లా రవాణాశాఖ అధికారి యోగేశ్వర్‌ జాదవ్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అధిక లోడ్‌తో వెళ్తున్న 6 వాహనాలను గుర్తించి సీజ్‌ చేశారు. ఫ్లైయాష్‌, డస్ట్‌, తదితర వాహనాల్లో మోతాదుకు మించి లోడ్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. అందువల్ల వాహనదారులు పరిమితికి మించి లోడ్‌ వేయరాదన్నారు.

ఈత చెట్ల దగ్ధంపై ఫిర్యాదు

చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వేచరేణి గ్రామ శివారు ఈత వనానికి నిప్పుపెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామ గౌడ సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కొమురవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2004లో అప్పటి ప్రభుత్వం గౌడ సంఘం సొసైటీకి 4 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. ఆ భూమిలో 2006లో సుమారు 5వేల ఈత మొక్కలు నాటారన్నారు. ఈత చెట్లకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నిప్పు అంటించడంతో సుమారు 200 ఈత చెట్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement