గజ్వేల్‌రూరల్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వివిధ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివారం గజ్వేల్‌లో మాల సంఘాల జేఏసీ వైస్‌చైర్మన్ తుమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న వారిలో కొంతమంది విద్యార్థుల జాబితా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదన్నారు. దీంతో సదరు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలపై సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. చైర్మన్ బక్కి వెంకటయ్య సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ కమిషనర్‌తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎల్లేశ్, యాదగిరి, శివకుమార్, రాజేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
దుబ్బాకరూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం మండలంలోని హబ్సిపూర్‌లోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


