న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
అక్రమ మైనింగ్‌పై
నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ)ఆరా తీసింది. మైనింగ్ చట్టాలను ఉల్లంఘించి, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి ఖనిజ సంపదను కొల్లగొడుతున్న తీరుపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని చైన్నెలోని ఎన్‌జీటీ దక్షిణ విభాగం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. నిజనిర్ధారణ కోసం సంయుక్త కమిటీని నియమించింది. కలెక్టర్ తరఫున నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ ఉమాహారతి, కాలుష్యనియంత్రణ మండలి తరఫున మరో అధికారిని నియమించారు. ఈ కమిటీ ఇటీవలే పటాన్‌చెరు మండలం లక్డారం, జిన్నారం మండలం ఖాజీపల్లిల్లోని మెటల్ క్వారీలను సందర్శించింది. ఈ కమిటీ సభ్యులు ప్రతీ క్వారీని సందర్శించి అక్కడ జరుగుతున్న ఉల్లంఘనలను పరిశీలించింది. పర్యావరణ నిబంధనలను తుంగలోతొక్కి, మైనింగ్ చట్టాల ఉల్లంఘనల తీరుపై ఈ కమిటీ ఎన్‌జీటీకి నివేదిక ఇవ్వనుంది.
యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందా
జిల్లాలో స్టోన్ అండ్ మెటల్ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. విలువైన ఖనిజ సంపదను లూఠీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌తోపాటు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వారి బినామీల పేర్లతో ఈ అక్రమ దందా సాగుతుండటంతో అడిగే నాథుడే లేకుండా పోయారు. ఈ మైనింగ్ మాఫియా గనులశాఖకు ఎగవేసిన సీనరేజీ ఏకంగా రూ.974 కోట్లు ఉందంటే..కొల్లగొట్టిన సహజ సంపద ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ మైనింగ్ మాఫియా పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కుతోంది. చెరువులు, కుంటలు తేడా లేకుండా క్రషర్లను నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ఆపాల్సిన భూగర్భ గనులశాఖతోపాటు, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులకు ప్రతీనెలా పెద్ద మొత్తంలో ముడుపులు ముడుతుండటంతో ఆయా శాఖల అధికారులు కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించడంతో ట్రిబ్యూనల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌జీటీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ఎన్‌జీటీ ఆదేశాల మేరకు ఈ క్వారీలను సందర్శించామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి ‘సాక్షి’ప్రతినిధితో తెలిపారు.
నిజనిర్ధారణ కోసం సంయుక్తకమిటీ నియామకం
లక్డారం, ఖాజీపల్లి క్వారీలు,క్రషర్లను సందర్శించిన కమిటీ


