మురిపించి.. ముఖం చాటేసి | - | Sakshi
Sakshi News home page

మురిపించి.. ముఖం చాటేసి

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

వర్షాల కోసం రైతన్న ఎదురుచూపులు

సంగారెడ్డి జోన్‌: రోహిణి కార్తెలో మురిపించిన వర్షాలు నేడు ముఖం చాటేశాయి. వానాకాలం సీజన్‌ ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు కురుస్తాయేమోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగులుతుంది. ఎల్‌నినో ప్రభావంతో రోజురోజు వర్షాలు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు పలు రైతులు పత్తి విత్తనాలు విత్తుకోగా, మరి కొంతమంది విత్తుకొనేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్‌ పంటల సాగుకు సన్నద్ధమవుతున్న క్రమంలో వర్షాలు సక్రమంగా కురువకపోవటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

7,62,580 ఎకరాల్లో పంటల సాగు

ఈ వానాకాలం సీజన్‌లో 7,62,580 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేశారు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు భూమిలో పదను పోయినప్పటికి చాలామంది రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అధికంగా పత్తి, పంటతోపాటు వరి, చెరుకు, ఇతర పంటలు సాగు చేస్తుంటారు. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలకు అంతరాయం కలగటంతో వానాకాలంలో సైతం ఎండలు దంచి కొడుతూ వేసవిని తలపిస్తుంది.

సాధారణం కంటే తక్కువ వర్షపాతం

ఈ ఏడాది ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనాలు వేసింది. జిల్లాలో జూన్‌ నెలలో 120.00 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 61.3 మి.మీలు కురిసింది. జులైలో 194.2 మి.మిల వర్షం కురవాల్సి ఉంది. రెండు నెలల్లో ఏ స్థాయిలో వర్షం కురుస్తుందో వేచి చూడాల్సి ఉంది. చాలా మండలాల్లో తక్కువ వర్ష పాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో మరింత తక్కువగా వర్షాలు కురుస్తాయని అధికారుల అంచనా.

అకాల వర్షాలకు విత్తుకున్న పత్తి విత్తనాలు

రోహిణి కార్తెలో కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో చాలాచోట్ల పత్తి విత్తనాలను ఇప్పటికే విత్తుకున్నారు. నేలలో తేమ శాతం లేకపోయినప్పటికీ రైతులు ముందడుగు వేశారు. మే నెలలో 27.8మి.మీల వర్షం కురువాల్సి ఉండగా 41.9మి.మీలు కురిసింది. దీంతో రైతులు జూన్‌ నెలలో కూడా వర్షాలు త్వరగా కురుస్తాయని ఆలోచనతో విత్తనాలు వేసేశారు. వర్షాలు కురువకపోవటంతో మొలకెత్తని విత్తనాలు భూమిలోనే పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు మొలకెత్తిన పత్తి మొక్కలు కాపాడుకునేందుకు బిందు సేద్యంతో నీటిని అందిస్తున్నారు.

పంటల సాగుపై ప్రతికూల ప్రభావం

ఎల్‌నినో ప్రభావం రైతులకు తీవ్రస్థాయిలో కలవర పెడుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వేడి గాలులు పెరిగి, భూగర్భ జలాలు తగ్గే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాల్సిన అవసరముందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు తట్టుకునే విధంగా సాగయ్యే సోయాబీన్‌, కంది, పెసర, మినుము పంటలతోపాటు స్వల్ప కాలిక పంటలు సాగు చేసుకోవాలి. వాణిజ్య పంటలలో తక్కువ సమయంలో పంట చేతికొచ్చే వైరెటీ రకాల విత్తనాలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వానకాలం సీజన్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌

రోహిణి కార్తె వర్షాలకే విత్తనాలువిత్తుకున్న రైతులు

పంటల సాగుపై రైతుల అయోమయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement