రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

సంగారెడ్డి : రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నట్టేట ముంచిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..కేంద్రం చెప్పిన కోట వరకు మాత్రమే పంటలు కొంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా ఒక్క గింజ కూడా కొనబోమని చెప్పడం రైతులకు మరణశాసనం లాంటిదన్నారు. అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాధలుగా మార్చే దుర్మార్గానికి కాంగ్రెస్‌ పార్టీ దిగజారిందని విమర్శించారు. వ్యవసాయాన్ని ఇప్పటికే సంక్షోభంలోకి నెట్టి రైతుల బతుకును చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ సొమ్మును ఢిల్లీకి పంపడమే చేస్తున్నారని ఆరోపించారు.

పదేళ్లపాటు ధైర్యంగా బతికిన రైతును మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బంధువుగా రైతు కష్టాలు తెలిసిన నాయకుడిగా రాష్ట్రంలో అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేశానికే ఆదర్శంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. అన్ని రకాల పంటల ఉత్పత్తితో తెలంగాణ దేశానికే ఫుడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందన్నారు. రాష్ట్రంలోని ప్రజల పక్షాన, రైతుల పక్షాన వారికి అండగా ఉంటూ బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ విజేందర్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, విఠల్‌, నాయకులు శ్రీధర్‌ రెడ్డి, గోవర్ధన్‌ నాయక్‌, సాబేర్‌ తదితరులు పాల్గొన్నారు.

జోగిపేట(అందోల్‌): రైతుల సంక్షేమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ విమర్శించారు. అందోలు లక్ష్మినర్సింహగార్డెన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా చేతులెత్తేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. వరి ధాన్యాన్ని ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు ఇప్పుడు మాట దాటవేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకోకుండా అన్నీ పంటలను సీలింగ్‌ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పి.జైపాల్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు పి.నారాయణ, పల్లే సంజీవయ్య, మాజీ ఎంపీపీ రామగౌడ్‌, చంద్రయ్య, నాయకులు లింగాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement