పటాన్‌చెరు టౌన్/రామచంద్రాపురం(పటాన్‌చెరు): కార్మికులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వివిధ విభాగాల్లో వైద్యుల సంఖ్యతో పాటు మరింత మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. రామచంద్రాపురం జాతీయరహదారి నుంచి ఆస్పత్రి వరకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు.
మల్లికార్జున స్వామి
సన్నిధిలో ప్రత్యేక పూజలు
అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని వివేక్ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర సుభిక్షం కోసం ప్రార్థించారు. అనంతరం ఆలయ ఈఓ దేవానందం, చైర్మన్ సుధాకర్ యాదవ్‌లు మంత్రి, ఎంపీ దంపతులతోపాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటు సుధా దంపతులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.హరిచందన తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్


