నిధుల దుర్వినియోగం ఫిర్యాదుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

నిధుల దుర్వినియోగం ఫిర్యాదుపై విచారణ

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

సిద్దిపేటరూరల్‌: పుల్లూరు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గత ప్రజావాణి కార్యక్రమంలో గ్రామానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం డీఎల్‌పీఓ చందన విచారణలో భాగంగా రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ నుంచి సంబంధించిన సమాచారం, పూర్తి విచారణ కోసం రికార్డులను సేకరించామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నిధులను తప్పుదారి పట్టిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రజిత, పంచాయతీ కార్యదర్శి గౌస్‌, తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాన్ని

అడ్డుకున్న అధికారులు

శివ్వంపేట(నర్సాపూర్‌): బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. మండల పరిధి లోని టిక్య దేవమ్మగూడం తండాలో 16 ఏళ్ల బాలికకు ఆదివారం వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు, పోలీసులు శనివారం తండాకు చేరుకున్నారు. ముందుగానే అధికారుల రాకను గమనించిన కుటుంబ సభ్యులు బాలికను కనిపించకుండా మరోచోటికి తరలించారు. దీంతో అధికారులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మైనర్‌ బాలికకు వివాహం చేస్తే చట్టప్రకారం కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆదివారం బాలికను అప్పగించాలని లేకపోతే కిడ్నాప్‌ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం అధికారి శంకర్‌గౌడ్‌, కార్యదర్శి నరేశ్‌, అంగన్‌వాడీ టీచర్‌ సరిత, తదితరులు ఉన్నారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

పాపన్నపేట(మెదక్‌): చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ కథనం ప్రకారం... మండల పరిధిలోని యూసుఫ్‌పేటకు చెందిన నర్ర రాములు (48) చేపలు పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఈ నెల 18న చేపలు పట్టేందుకు వల తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో నీట మునిగి చనిపోయాడు. సాయంత్రం వరకు అతను ఇంటికి రాకపోయే సరికి కుటుంబీకులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం చెరువు కట్టపై అతని బట్టలు, చెప్పులు, ఫోన్‌ కనిపించే సరికి, అనుమానంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా రాములు మృతదేహం లభ్యమైంది.

వ్యక్తి దారుణ హత్య

సంగారెడ్డి క్రైమ్‌: యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లాకు చెందిన వడ్ల నగేశ్‌(25), కొన్నేళ్లుగా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. శనివారం ఉదయం మహబూబ్‌సాగర్‌ చెరువు కట్టపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడి వద్ద లభించిన ఆధారాలతో నగేశ్‌గా గుర్తించారు. మృతుడి శరీరంపై ఆయుధాలతో దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పట్టణ సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement