● రూ. 6 లక్షల రికవరీ ● కేసు వివరాలు వెల్లడించిన సీఐ రేణుకా రెడ్డి
టేక్మాల్(మెదక్): ఫేక్ ఇన్‌స్ట్రాగామ్ ఐడీలను క్రియేట్ చేసి ప్రేమ పేరుతో ఇద్దరి యువతులను మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేశ్ జల్సాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నాడు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో తన చదువులకు డబ్బులు కావాలని ఇద్దరి నుంచి బంగారు నగలతో పాటూ రూ.12లక్షలు కాజేశాడు. కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.6లక్షలు రికవరీ చేశారు. టేక్మాల్ ఎస్‌ఐ అరవింద్‌కుమార్, సిబ్బంది రామకృష్ణ తదితరులు ఉన్నారు.
బాలికను పెళ్లి చేసుకున్న కేసులో ముగ్గురు..
పటాన్‌చెరు టౌన్: బాలికను పెళ్లి చేసుకున్న ఘటనలో ప్రమేయమున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అసోంకు చెందిన బాలిక(17)ను వివాహం చేసుకొని వదిలి పెట్టిన మధ్యప్రదేశ్‌కు చెందిన శివశంకర్‌ను, అనంతరం సహజీవనం చేసిన మహారాష్ట్రకు చెందిన దిగంబర్‌ను, అలాగే బాలిక తల్లి ఆయాన్ పిచాను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
కాపర్ వైర్ దొంగల ముఠా..
జహీరాబాద్ టౌన్: కాపర్ వైర్లను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కర్నాటకలోని బసవకల్యాణ్, బీదర్ ప్రాంతాలకు చెందిన రఘుబాయి(48), సర్జబాయి(34), అమీర్ సాబ్(26)లతో పాటు మరో ఇద్దరు మైనర్ బాలురు పట్టణంలోని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో చోరీకి పాల్పపడ్డారు. మరమ్మతుల కేంద్రం స్టోర్ రూమ్‌కు రంధ్రం చేసి ఒక కిలో కాపర్, మూడున్నర కిలోల అల్యూమినియం తీగలను ఈ నెల 13న చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా శనివారం బీదర్ చౌరస్తాలో దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద చోరీ చేసిన తీగలను స్వాధీనం చేసుకున్నారు.


