మెదక్‌జోన్: నా ప్రతి అడుగు, నా ఎదుగుదలలో మా నాన్న కొండల్‌రావు పాత్ర మరువలేనిది. నా తండ్రే నా హీరో అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఫాదర్స్‌డే సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా తల్లిదండ్రులకు ముగ్గురం సంతానం. తన తండ్రి స్వర్గీయ కొండల్‌రావు టీచర్ అని చెప్పారు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్నా, చదువే పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తిగా మా తండ్రి ఉన్నత చదువులు చదివించారు. ఆయన చూపిన మార్గాన్ని ఎంచుకుని ముగ్గురం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాం. నేను గ్రూప్–1 అధికారిగా ఎంపికై న రోజు మా నాన్న ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం నా జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం. నేను జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ప్రజలకు సేవ చేస్తున్న దృశ్యాన్ని మా తండ్రి కళ్లారా చూడలేకపోయారనే బాధ నన్ను వెంటాడుతుంది. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.


