సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈ వర్షాకాలంలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఇంటి ఆవరణల్లో నాటే (హోంస్టిడ్) మొక్కలను మహిళలకు ఇవ్వనున్నారు. ఒక్కో సభ్యురాలికి మూడు, నుంచి నాలుగు మొక్కలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం గ్రామ మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించి.. గ్రామంలో ఉన్న స్వయం సహాయక సంఘాలన్నింటినీ ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించింది. ప్రధానంగా దానిమ్మ, సపోట, కరివేపాకు, మునగ, జామ వంటి మొక్కలను మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. వర్షాకాలం ప్రారంభమైంది. అయితే అనుకున్న మేరకు వర్షాలు కురవకపోవడంతో మొక్కలు నాటే కార్యక్రమం ఊపందుకోవడం లేదు.
ఈసారి 20 లక్షలు టార్గెట్..
ఈఏడాది వనమహోత్సవంలో 20 లక్షల మొక్కలను నాటాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు వనమహోత్సవ ప్రణాళికను రూపొందించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 10.50 లక్షల మొక్కలు నాటాలని భావిస్తోంది. జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 3.20 లక్షల మొక్కలు నాటేలా నిర్ణయించారు. అటవీశాఖ ద్వారా లక్షల మొక్కలు, హార్టికల్చర్ శాఖ ద్వారా 50 వేల మొక్కలు నాటేలా నిర్ణయించారు.
టీజీఐఐసీ భూముల్లో..
జిల్లా వ్యాప్తంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కి పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. పలుచోట్ల ఇండస్ట్రియల్ పార్కులున్నాయి. ఈ పార్కుల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం ద్వారా ఇటు పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యానికి కొంతమేరకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. ఇలా సుమారు 53 వేల మొక్కలను టీజీఐఐసీ భూముల్లో నాటేలా ప్రణాళికను సిద్ధం చేశారు.
జాతీయ రహదారుల వెంట..
జిల్లాలో పలు జాతీయ రహదారులున్నాయి. ముంబై హైవేతోపాటు, నాందేడ్–అకోలా రహదారి, 765డి మెదక్–హైదరాబాద్ హైవే ఇలా పలు జాతీయ రహదారులున్నాయి. వీటి పక్కల ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం 52 వేల మొక్కలను కేటాయించారు. ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలను నాటాలని భావిస్తున్నారు. ఇలా మొత్తం 15 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈసారి 20 లక్షల మొక్కలను నాటడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ఎస్‌హెచ్‌జీల ద్వారావనమహోత్సవ మొక్కలు పంపిణీ
ఈసారి మొక్కలు నాటే లక్ష్యం20 లక్షలు
వర్షాభావ పరిస్థితులతోఇంకా ఊపందుకోని వనమహోత్సవం
613 నర్సరీల్లో పెంపకం
జిల్లా వ్యాప్తంగా 613 నర్సరీలున్నాయి. ఉపాధి హామీ నిధులతో వీటిలో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం 36 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే గతేడాది నాటకుండా మిగిలిన మొక్కలు బాగా పెరిగాయి. మొదట ఈ పెద్ద మొక్కలను నాటనున్నారు. ఈసారి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు ప్రణాళికను అమలు చేస్తామని ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.


