పుస్తకాలతో కుస్తీ పట్టించడం..పాఠాలు బట్టీ పట్టించే విధానానికి స్వస్తి చెప్పి బడి అంటే స్వతహాగా ఉండే భయం నుంచి చిన్నారులను దూరం చేస్తూ పాఠశాల పట్ల ఆకర్షితుల య్యేలా ప్రీప్రైమరీ తరగత్తుల్లో కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు.
నారాయణఖేడ్:
ప్రభుత్వం కొత్తగా పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా జిల్లాలో మొదట నాలుగు పాఠశాలలు ఉండగా గతేడాది 59, ఈ ఏడాది 132 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించింది. అంగన్‌వాడీ చిన్నారులతోపాటు కొత్తగా చిన్నారులను ఈ ప్రీప్రైమరీలో చేర్చుకుంటున్నారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సులోపు వారు కావడంతో స్వతహాగా బడి అంటే భయం ఉంటుంది. దీన్ని నివారిచేందుకు వారికి ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన వాతావరణం కల్పిస్తున్నారు.
ఆనందంగా..ఆటపాటలతో 12 వారాలు..
చిన్నారులకు చదువంటే భయం పోగొట్టి ఆడుతూ పాడుతూ పాఠశాలకు అలవాటు పడేలా విద్యాశాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యా ప్రవేశ్ అనే పేరుతో 12 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 28 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలి మూడు నెలలపాటు బట్టీ విధానం కాకుండా చిన్న, చిన్న కార్యక్రమాల ద్వారా బోధన చేస్తారు. ఈ 12 వారాలు, 60 పనిదినాల్లో పిల్లలపై పుస్తకాల భారం ఉండకుండా చూస్తారు. రోజుకు 4గంటల పాటు కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇండోర్, ఔట్‌డోర్ ఆటలు, బొమ్మలు గీయడం, మట్టితో వస్తువులు తయారు చేయించడం, చిన్న చిన్న కథలు చెప్పడం ద్వారా వారిలో ఆలోచనా శక్తిని పెంపొందిస్తారు. తరగతి గదిలో చిన్నారికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటలు, పాటలు, బొమ్మలు, కథల ద్వారా బోధిస్తారు. పిల్లల్లో ఆరోగ్యం, యోగక్షేమం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, చురుకై న అభ్యాసకులుగా తీర్చిదిద్దడం అనే మూడు లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కింద అక్షరాలు, రంగులు, ఆకారాలు, ప్రాథమిక గణిత భావనలను నేర్పిస్తారు. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక ప్రవర్తనపై అవగాహన కల్పిస్తారు. ఇందుకుగాను పిల్లల కోసం తరగతి గదులను ఆకర్షిణీయంగా తీర్చిదిద్దడం, శిశు స్నేహపూర్వక మరుగుదొడ్లు, ఆట వస్తువుల ఏర్పాట్లకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించనుంది. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, పాఠశాల అంటే భయం తగ్గడం, ప్రాథమిక భాషా, గణిత నైపుణ్యాలకు బలమైన పునాది ఏర్పడటం, 1వ తరగతి బోధనను సులభంగా అర్థం చేసుకునే స్థాయికి చేరుకోగలరని భావిస్తున్నారు.
ప్రీప్రైమరీ విద్యార్థులకువిద్యా ప్రవేశ్ కార్యక్రమాలు
12 వారాలు, 60 పనిదినాలు
పుస్తకాలతో కుస్తీ, బట్టీ విధానానికి చెల్లుచీటీ
ఆహ్లాదకర వాతావరణంలోబడిలో చిన్నారులు


