జోగిపేట (అందోల్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మండల, గ్రామ, పట్టణ పార్టీ కమిటీల ఏర్పాటు ఊసే లేకపోవడంతో మండల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటికే కమిటీల ఏర్పాటు పూర్తవ్వగా.. పటాన్‌చెరువు, నారాయణఖేడ్‌లలో నాయకుల అభిప్రాయ సేకరణ తుది దశకు చేరింది. అయితే, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోలులో మాత్రం కమిటీలపై ఎలాంటి చర్చ జరగకపోవడం విశేషం.
భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం!
అందోలు నియోజకవర్గం పరిధిలో అందోలు, పుల్కల్, చౌటకూరు, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాలతో పాటు అందోలు–జోగిపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం పాత కమిటీలనే ఇక్కడ యథాతథంగా కొనసాగించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో, ఈసారి నియమించే కమిటీల్లో సమర్థులైన వారికి అవకాశం ఇవ్వాలని, అన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కార్యకర్తలు కోరుతున్నారు. అన్ని మండలాల్లోనూ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు బలమైన ఆశావహులు ఉన్నప్పటికీ, మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణయమే తుది నిర్ణయం కావడంతో ఎవరూ బహిరంగంగా నోరు మెదపడం లేదు.
నామ్‌కే వాస్తేగా అనుబంధ సంఘాలు
నియోజకవర్గంలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ’యువజన కాంగ్రెస్’ అసలు ఉందా లేదా అన్నట్లుగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు నిర్వహించలేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ప్రతిపక్షాలు పార్టీపై, మంత్రిపై చేస్తున్న ఆరోపణలను కనీసం ఖండించిన సందర్భాలు కూడా లేవని యువత వాపోతోంది. కొంతమంది కేవలం నామ్‌కే వాస్తేగా పోస్టులు దక్కించుకుని, మంత్రి పర్యటనల సమయంలో ఆయన కంటబడేందుకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో అనుబంధ సంస్థ ’ఎన్‌ఎస్‌యూఐ’ సైతం నియోజకవర్గంలో ఉనికి చాటుకోలేకపోతోంది. కనీసం విద్యార్థుల సమస్యలపై పోరాడిన దాఖలాలు లేవని తెలుస్తోంది.
ఆరేళ్లుగా ఖాళీగానే..
జోగిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గుర్రం సత్తయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పోస్టును భర్తీ చేయకపోవడం గమనార్హం. పట్టణ కమిటీ, అధ్యక్షుడు లేకుండానే గత అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికలు, రాహుల్ గాంధీ జోడో యాత్రతో పాటు పీసీసీ అధ్యక్షుల పాదయాత్రలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చినప్పటికీ... ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్నందున అధికారిక కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి నాయకుల పర్యటనల నిర్వహణకు కమిటీల అవసరం ఎంతో ఉంది. మంత్రి పర్యటనల సమాచారాన్ని స్థానిక శ్రేణులకు చేరవేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇప్పటికై నా మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ తీసుకుని పట్టణ, మండల కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక కేడర్ కోరుతోంది.
‘అందోలు’లో నేటికీ ఏర్పాటు కాని
మండల పార్టీ కమిటీలు
మంత్రి దామోదర సొంతనియోజకవర్గంలో కొనసాగుతున్న చర్చ
ఆరేళ్లుగా ఖాళీగానే జోగిపేట పట్టణ
కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి!
పేరుకే పరిమితమైన యువజన,
ఎన్‌ఎస్‌యూఐ అనుబంధ సంఘాలు


