ఆగింది టీకా.. అవగాహన లేక! | - | Sakshi
Sakshi News home page

ఆగింది టీకా.. అవగాహన లేక!

Jun 18 2026 8:04 AM | Updated on Jun 18 2026 8:04 AM

పటాన్‌చెరు టౌన్‌: ప్రాణాంతకంగా మారే గర్భాశయ ముఖద్వార (సర్వికల్‌) క్యాన్సర్‌ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం ఉచితంగా టీకా అందిస్తున్నప్పటికీ తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలు, అవగాహన లోపం, సంప్రదాయ భావజాలం కారణంగా టీకా వేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 14–15 ఏళ్ల మధ్య వయసు బాలికలు 12,635 ఉండగా ఇప్పటివరకు 2,988 మంది బాలికలు మాత్రమే టీకాలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ పద్ధతులను అనుసరించే కుటుంబాలను టీకాలు తీసుకునేందుకు ఒప్పించడం ఆరోగ్య శాఖకు మరింత సవాలుగా మారింది.

పటాన్‌చెరులో కొంత మెరుగ్గా..

పటాన్‌చెరు పట్టణ ప్రాంతంలో పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉండటంతో కొంతమంది తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ కుమార్తెలకు టీకా వేయిస్తున్నారు. దీంతో స్పందన కాస్త సానుకూలంగా కనిపిస్తోంది.

కార్యక్రమం ప్రారంభమిలా...

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8న 14–15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో టీకా పంపిణీ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది. సాధారణంగా ఈ టీకాను ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు వేల రూపాయలు ఖర్చవుతుంది. మొత్తం ప్రక్రియకు సుమారు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వ్యయం అవుతుంది. అలాంటి విలువైన టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నప్పటికీ, ప్రజల్లో అవగాహన పెరగకపోవడం వల్ల లక్ష్యానికి అనుగుణంగా ప్రయోజనం చేకూరడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

టార్గెట్‌ పూర్తి కాకపోవడానికి కారణాలు

టీకా ప్రారంభంలో బాలికలకు పదో తరగతి పరీక్షల్లో బిజీగా ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదు. పరీక్షల తర్వాత పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించే బాధ్యత ఇచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తల్లో చాలామంది జనగణన విధులు అప్పగించారు. పెళ్లి తర్వాత గర్భధారణ సమస్యలు వస్తాయనే అపోహతో చాలామంది తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు.

టీకా తప్పనిసరి

14 నుంచి 15 ఏళ్ల వయసు గల బాలికలు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టే లక్ష్యంతో ఈ టీకాను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు బాలికలకు వేయించాలి.

– నేత్రవతి, వైద్యాధికారి, పటాన్‌చెరు

లక్ష్యానికి దూరంగాహెచ్‌పీవీవీ కార్యక్రమం

జిల్లాలో 12,635 మంది బాలికలను గుర్తించిన అధికారులు

వారిలో టీకాలు తీసుకున్నవారు 2,988 మందే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement