రూ.70 కోట్లతో ఫార్మసీ కళాశాల | - | Sakshi
Sakshi News home page

రూ.70 కోట్లతో ఫార్మసీ కళాశాల

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

● జోగిపేట ఆస్పత్రిలో ట్రామాకేర్‌ సెంటర్‌ ● సింగూరు పర్యాటక కేంద్రంగాఅభివృద్ధికి కృషి ● మంత్రి దామోదర రాజనర్సింహ

● జోగిపేట ఆస్పత్రిలో ట్రామాకేర్‌ సెంటర్‌ ● సింగూరు పర్యాటక కేంద్రంగాఅభివృద్ధికి కృషి ● మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట(అందోల్‌): అందోల్‌లో రూ.70 కోట్లతో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. జోగిపేటలోని శ్రీ రామ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్‌ అధ్యక్షత వహించారు. మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకే ప్రాధాన్యత నిస్తుందన్నారు. ప్రభు త్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అందోలులో తాను విద్య, వైద్య పరంగా హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నర్సింగ్‌ కళాశాల, జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్‌ కళాశాలలు, 150 పడకల ఆస్పత్రిని తీసుకువచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు సింగూరు ప్రాజెక్టు కాలువ గూర్చి పట్టించుకోలేదని, తాను రూ.200 కోట్లతో కాలువల లైనింగ్‌ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. సింగూరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, ప్రతి రోజు కనీసపం 4,5 వేల మంది పర్యాటకులు పర్యటించేలా, దీంతో 100 కుటుంబాలు బ్రతికేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.

ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు

అందోల్‌లో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రిలో ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దామోదర్‌ తెలిపారు. అందోల్‌కు ఇరువైపులా 30 కి.మీ లోపు రోడ్డు ప్రమాదాలు జరిగితే అంబులెన్స్‌ లో ట్రామాకేర్‌ సెంటర్‌కు తీసుకువచ్చినట్లయితే నిమిషాల్లో చికిత్సలను అందజేస్తారని, 24 గంటలు ఆస్పత్రిలో డాక్టర్‌ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. పెద్దారెడ్డిపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ ప్రతీక జైన్‌, ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌, డిప్యూటీ కలెక్టర్‌ పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్‌.కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఆకుల చిట్టిబాబు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్‌, జోగిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం.జగన్మోహన్‌ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ మల్లారెడ్డి, డీఎంహెచ్వో వసంత్‌ రావునాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement