వాటిని తిరస్కరిస్తున్నాం
సర్కారు భూముల
● కబ్జా భూములకు పట్టాలివ్వాలని సాదాబైనామాల కింద దరఖాస్తులు
● అక్రమంగా చెరబట్టిన భూములను సక్రమం చేసుకునేందుకు స్కెచ్
● అమీన్‌పూర్, పటాన్‌చెరు, కంది, సంగారెడ్డి తదితర మండలాల్లో దందా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కబ్జాలకు పాల్పడిన సర్కార్ భూములను సక్రమం చేసుకునేందుకు కబ్జాదారులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. సాదాబైనామ ముసుగులో ఈ కబ్జా భూములను సక్రమం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. భూభారతిలో సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములకు పట్టాలు మంజూరు కోసం వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కబ్జాలకు పాల్పడిన ప్రభుత్వ భూములకు సాదాబైనామా ప్రక్రియలో పట్టాలు పొందేందుకు కొందరు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ప్రధానంగా పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం, కంది, సంగారెడ్డి, జిన్నారం, గుమ్మడిదల, సదాశివపేట తదితర మండలాల్లో ఇలా అక్రమంగా చెరబట్టిన భూములను సక్రమం చేసుకునేందుకు సాదాబైనామా అస్త్రాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
సందెట్లో సడే మియా అన్నట్లుగా..
జిల్లాలో ప్రభుత్వ భూములను కొందరు నాయకులు, బడాబాబులు చెరబట్టారు. తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రూ.వేల కోట్లు విలువ చేసే భూములను కబ్జాలకు పాల్పడ్డారు. ఇందుకు రెవెన్యూ అధికారులు కూడా సహకరించారు. దీంతో భూఆక్రమణలు జిల్లాలో యథేచ్ఛగా కొనసాగాయి. కబ్జాలకు పాల్పడిన ఈ భూములను అక్రమార్కులు సాదాబైనామాలతో కొనుగోలు చేశామని, వాటిని రెగ్యులరైజ్ చేయాల ని దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. వీటిని పట్టాలు తీసుకుంటే అధికారికంగా వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవచ్చని పెద్ద స్కెచ్ వేశారు.
నోటీసులు ఇస్తున్న అధికారులు
భూభారతిలో సాదాబైనామాల కింద వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా దరఖాస్తుదారులతో పాటు బహిరంగ నోటీసులు జారీ చేస్తున్నారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో ఆధారాలతో తెలపాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. ఎలాంటి అభ్యంతరాలు రాని భూములను రెగ్యులరైజ్ చేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 8,446 దరఖాస్తులు
సాదాబైనామాల కింద జిల్లా మొత్తం 8,446 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో 3,231 దరఖాస్తులు రాగా, ఆందోల్ రెవెన్యూ డివిజన్‌లో 2,608 దరఖాస్తులు ఉన్నాయి. అలాగే జహీరాబాద్ రెవెన్యూ డివిజన్‌లో 1,203, నారాయణఖేడ్ డివిజన్‌లో 1,404 దరఖాస్తులు సాదాబైనామాలవి ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల మేరకు తహసీల్దార్లు, ఆర్డీఓలు ఈ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
సాదాబైనామా దరఖాస్తులన్నింటిని క్షుణ్ణ ంగా పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ భూములను సాదాబైనామాల కింద రెగ్యులరైజ్ చేసుకునేందుకు పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తాం. సాదాబైనామాల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. –జి.రాజేందర్, ఆర్డీఓ


