● చెరువులు, బావుల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి ● నిపుణుల సమక్షంలోనే ఈత నేర్చుకోవాలి ● హెచ్చరిస్తున్న నిపుణులు
సంగారెడ్డి క్రైమ్/సంగారెడ్డి టౌన్: వేసవి వచ్చిందంటే చాలు వేడి నుంచి ఉపశమనం పొందడానికి చిన్న, పెద్ద తేడా లేకుండా చెరువులు, వాగులు, బావుల్లో సరదాగా ఈత కొడుతుంటారు. అయితే కొన్నిసార్లు ఈ సరదా ప్రాణాల మీదకు తెస్తుంది. జిల్లాలో ఇంటర్, పది పరీక్షలు పూర్తయి విద్యార్థులకు సెలవులిచ్చేశారు. దీంతో విద్యార్థులు, యువత ఆనందం కోసం చెరువులు, కుంటలు, బావులు, కాలువల వద్దకు వెళ్తుంటారు. మరికొందరు ఆటలు, ద్విచక్ర వాహనాలపై తిరగడం, మొబైల్ ఫోన్లు వాడకం పెరగడంతో పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే తెలిసి, తెలియక ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది.
నిపుణుల సమక్షంలో..
పిల్లలను నిపుణుల సమక్షంలో లేదా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈత నేర్పించాలి. చెరువులు, కుంటలు, బావులు ఇతర జలాశయాల్లో అడుగున బురద పేరుకుపోయి ఉంటుంది. అందులోని పరిస్థితిని తెలుసుకోకుండా దూకితే ప్రమాదం బారిన పడతారు. ప్రతి సంవత్సరం వేసవిలో ఈతకు వెళ్లి చెరువులో మునిగి చనిపోతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు ఆటలాడించడం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేలా సమయం కేటాయించాలి. మంచి పుస్తకాలను చదివించాలి. పలు చోట్ల చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో లోతు తెలియక అందులోకి దిగి పిల్లలు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.


