● తాగునీటి ప్రాజెక్టుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ● 50ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక ● ఎంపీ, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవాలి
సదాశివపేట(సంగారెడ్డి): యాభై ఏళ్ల వరకు పట్టణ ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాగునీటి ప్రాజెక్టుకు రూ.135 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలోని ఎంజీ బ్యాంకెట్ హాలులో మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు, విద్యుత్, మున్సిపల్ చైర్‌పర్సన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్‌పర్సన్ రేణుక, కౌన్సిలర్లతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి సమీక్ష నిర్వహించారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి పట్టణంలోని ఇంటింటికీ మంజీరా తాగునీరు సరఫరా చేసేందుకు ఇంటెక్‌వేల్, ఫిల్టర్‌బెడ్, ట్యాంకులు, నూతన పైప్‌లైన్ నిర్మాణం, ప్రతీ రోజు గంటన్నర తాగునీటి సరఫరాకు రూ.135 కోట్ల నిధుల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారని సూచించారు.
అందుబాటులోకి 52 లక్షల గ్యాలెన్ల నీళ్లు
60 వేల పట్టణ జనాభాకు ప్రతీ రోజు 21లక్షల గ్యాలెన్ల తాగునీరు అవసరం కాగా నూతనంగా నిర్మించనున్న ప్రాజెక్టు స్కీమ్‌లో 52 లక్షల గ్యాలెన్ల నీళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. రాజకీయాలకతీతంగా కౌన్సిలర్లు తమ వార్డుల్లోని సమస్యలను అభిప్రాయాలు నమోదు చేసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. ఈనెల 18న వ్యక్తిగతంగా ఎంపీ, ఎమ్మెల్యేను కలిసి అభిప్రాయలను తెలుసుకుని 19వ తేదీన ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నివేదికను నిర్మలారెడ్డికి అందజేస్తే తాను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరతానని జగ్గారెడ్డి తెలిపారు. నిధులు మంజూరు కాగానే రెండేళ్లలో పనులు పూర్తిచేయిస్తానని హామీనిచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాల ప్లాట్లు, వార్డు రూ.8 కోట్ల నిధులు గురించి సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిద్దామని పాలకవర్గ సభ్యులకు సూచించారు.


