కుట్రదారులెవరు..?
జోగిపేట(అందోల్): మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల, ప్రతికూల ఫలితాలపై అభ్యర్థులు బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తమకు చెయ్యిచ్చిందెవరు? చేయూతనిచ్చిందెవరు? అన్న విషయంలో ఆరా తీస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రతీ మున్సిపాలిటీలో కూడా ఈ విషయమై చర్చ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జిల్లా మొత్తంలో బీజేపీ 16 కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోగా, ఎంఐఎం పార్టీ సంగారెడ్డి, జహీరాబాద్‌లలో మూడు స్థానాలను గెలుచుకుంది. విజయం సాధించిన వారు గెలుపు సంబరాల్లో ఉండగా, ఓటమిపాలైన వారు మాత్రం అందుకుగల కారణాలను పోస్టుమార్టం చేస్తున్నారు. ఏ కులాలు, మతాల వారు తమకు ఓటు వేయలేదు. ఓటర్లను అన్ని విధాలా ప్రభావితం చేయగలిగినా ఎందుకు మనకు ఓటు వేయలేకపోయారు? పార్టీ విధానాలు, నాయకుల పట్ల అసంతృప్తే కారణమా? అన్న కోణంలో కారణాలను విశదీకరించుకుంటున్నారు. అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినా ముఖ్య నాయకుల ఓటమికి కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు.
సొంత పార్టీలోనే కుట్రలు
చాలాచోట్ల సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు తమ అభ్యర్థుల ఓటమికి కారకులయ్యారన్న ఆరోపణలున్నాయి. ఎదుటి పార్టీ ప్రలోభాలకు లొంగడమే కాకుండా, తమకు టికెట్టు దక్కకపోవడంతో దక్కిన వారిని ఓటమి చెందేలా కుట్రలు చేశారు. జోగిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్టీలోని ముఖ్య నాయకులు పనిచేయకుండా రెబల్‌గా పోటీ చేసిన అభ్యర్థికి పూర్తిస్థాయిలో అండగా నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారకులయ్యారు. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి ఒక ముఖ్య నాయకుడి సోదరుడు మైనార్టీ నాయకుడితో కలిసి కుట్రలు చేసి వందకుపైగా ఓట్లను బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చేలా చేశారు. అయినా ఆ వార్డులో తట్టుకుని 200కుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నాయకులే కారకులయ్యారు. 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలు బహిరంగంగానే పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసినా ఓట్ల శాతం తగ్గినా గెలుపొందారు. 11వ వార్డుకు చెందిన నాయకుడు 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రచారం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 19వ వార్డులో ముఖ్య నాయకుడు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదని గెలుపొందిన అభ్యర్థి ఆరోపించడం విశేషం. 1వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఒక వర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయి ఆ పార్టీ అభ్యర్థి ఓటమికి కారకులయ్యారు. 3వ వార్డులో ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేయించినట్లు ఆరోపణలున్నాయి.
చెయ్యిచ్చింది.. చేయూతనిచ్చింది?
మున్సిపల్ ఫలితాల విశ్లేషణలోబీఆర్‌ఎస్,కాంగ్రెస్ నేతలు
సొంత పార్టీల్లోనే బయటపడ్డ లుకలుకలు


