
అడ్డగోలు స్కానింగ్‌లు
● కనీస నిబంధనలు పాటించనిప్రైవేటు ఆస్పత్రులు
● రాష్ట్ర అధికారుల తనిఖీల్లో వెల్లడైన బాగోతం
● పీసీపీఎన్‌డీటీ నిబంధనల్ని గాలికొదిలిన వైనం
ఎందుకు పట్టుకోలేదు?
జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వైద్యారోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించింది. జిల్లా అధికారుల బృందాలతోపాటు, రాష్ట్ర అధికారులు కూడా ఈ ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నాయి. అయితే రాష్ట్ర అధికారుల బృందాలు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ స్కానింగ్‌ల వ్యవహారం బట్టబయలైంది. కానీ, జిల్లా అధికారుల బృందాలు ఈ అక్రమ స్కానింగ్‌లను ఎందుకు పట్టించుకోలేదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా జిల్లా అధికారులు తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో రెండు ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్డగోలుగా స్కానింగ్‌ల దందా సాగుతోంది. నిబంధనల ప్రకారం గర్భిణీలకు నిర్వహించిన ప్రతీ స్కానింగ్ వివరాలను ప్రభుత్వానికి సంబంధించిన పీఎన్‌డీటీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. కానీ, ఈ ఆస్పత్రులు నిబంధనలను తుంగలో తొక్కాయి. వీళ్లు చేసిన స్కానింగ్‌లకు, పోర్టల్‌లో నమోదైన స్కానింగ్‌లకు భారీగా తేడాలున్నట్లు వెలుగుచూసింది. అలాగే వైద్యుడు రిఫర్ చేసిన స్లిప్ ఉంటే మాత్రమే స్కానింగ్ చేయాల్సి ఉండగా అటువంటి స్లిప్‌లు లేకుండానే స్కానింగ్ చేసేశాయి. పైగా ఈ స్కానింగ్‌లకు సంబంధించి ఈ ఆస్పత్రులు కనీసం రికార్డులను కూడా నిర్వహించలేదు. ఇటీవల రాష్ట్రస్థాయిలో అధికారుల బృందాలు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ స్కానింగ్‌ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్యశాఖ అధికారులు నామమాత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకున్నారు.
కాసులకు కక్కుర్తి పడి
భ్రూణ హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్కానింగ్‌ల విషయంలో పీసీ పీఎన్‌డీటీ చట్టం (ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ యాక్ట్) కింద కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే కాసులకు కక్కుర్తి పడుతున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఈ నిబంధనలను కాలరాస్తూ స్కానింగ్ దందాను సాగిస్తున్నాయి. పైన పేర్కొన్న ఉదాహరణలే ఇందుకు నిదర్శనం. గ్రామాల్లో పనిచేస్తున్న పీఎంపీలు, ఆర్‌ఎంపీలను ఏజెంట్లను పెట్టుకుని తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రులు, ఇతర సంస్థలు జిల్లాలో మొత్తం 656 ఉన్నాయి. ఇందులో ఆస్పత్రులతోపాటు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, దంత వైద్యశాలలు, పాలిక్లీనిక్‌లు, ఫిజియోథెరపీ యూనిట్లు, పునరావాస కేంద్రాలు, ఆయుష్ ఆస్పత్రులు, క్లీనిక్‌లు ఉన్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు కింద వీటికి అనుమతులు జారీ అయ్యాయి. అయితే కొన్ని ఆస్పత్రులు కాసులకు కక్కుర్తిపడి ఈ నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. ఇష్టారాజ్యంగా స్కానింగ్ చేసి డబ్బులు దండుకుంటున్నాయి.