అమల్లోకి ముఖ గుర్తింపు హాజరు | - | Sakshi
Sakshi News home page

అమల్లోకి ముఖ గుర్తింపు హాజరు

Aug 2 2025 7:20 AM | Updated on Aug 2 2025 7:20 AM

అమల్ల

అమల్లోకి ముఖ గుర్తింపు హాజరు

జహీరాబాద్‌: పాఠశాలలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు బోధించకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులకు చెక్‌ పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదని, విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చింది. దీంతో ఉపాధ్యాయుల ఇష్టారీతిగా వ్యవహరించే విధానానికి తెరపడినట్లైంది. జిల్లాలోని 1,264 పాఠశాలల్లో ఈ విధానం అమలు కానుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించేవిధంగా, హాజరును వారే నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేలా ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. సంబంధిత ఉద్యోగి సెల్‌ఫోన్‌లోనే టీజీఎఫ్‌ఆర్‌సీ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి వారి హాజరును నేరుగా ఆన్‌లైన్‌లో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అందుకనుగుణంగా ఉపాధ్యాయులు శుక్రవారం పాఠశాలలకు చేరుకోగానే యాప్‌ను ఉపయోగించి హాజరు నమోదు చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5,900మంది బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. వీర ంతా ఫేస్‌ రికగ్నేషన్‌ కోసం టీజీఎఫ్‌ఆర్‌సీ యాప్‌ను తమ స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

సమయానికి చేరుకోలేక పోతున్నారనే...

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకుండా పోతున్నారనే ఫిర్యాదులు వచ్చిన కారణంగానే ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గతేడాది పెద్దపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టడంతో విజయవంతం అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు. అనేకమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్న చోట నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో స్కూళ్లకు సకాలంలో హాజరు కాలేకపోవడం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటూ విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌ రికగ్నేషన్‌ అమల్లోకి తెచ్చారు.

సర్వర్‌ డౌన్‌తో నమోదులో ఆలస్యం

సర్వర్‌ డౌన్‌తో ఫేస్‌ రికగ్నేషన్‌ నమోదు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా ఒకేసారి నమోదు చేయడంతో సర్వర్‌ డౌన్‌ అయినట్లు జహీరాబాద్‌ ఎంఈఓ మాణయ్య పేర్కొన్నారు. ప్రక్రియను పూర్తిచేసుకున్న అనంతరం ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు.

ఈ విధానాన్ని స్వాగతిస్తున్నాం

ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫేస్‌ రికగ్నేషన్‌ విధానాన్ని తమ యూనియన్‌ పూర్తిగా సమర్ధిస్తోంది. ఎప్పట్నుంచో ఈ విధానాన్ని అమలు చేయాల్సిందిగా తమ యూనియన్‌ కోరుతూ వచ్చింది. ఈ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుంది. పాఠశాలల్లో టీచర్ల సంఖ్యను పెంచాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన ఆశయం నెరవేరుతుంది.

–కె.దత్తాత్రి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) జిల్లా అధ్యక్షుడు

డుమ్మాకొట్టే, ఆలస్యంగా వచ్చే టీచర్లకు చెక్‌

పలు పాఠశాలల్లో సర్వర్ల డౌన్‌తో నమోదు ప్రక్రియలో జాప్యం

స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

అమల్లోకి ముఖ గుర్తింపు హాజరు1
1/1

అమల్లోకి ముఖ గుర్తింపు హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement