
జనహితకు జేజేలు
● కాంగ్రెస్ పాదయాత్రకు అనూహ్య స్పందన
● ఆద్యంతం ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
● దారిపొడవునా హోరెత్తిన నినాదాలు
వట్‌పల్లి(అందోల్): కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఆ పార్టీ కార్యకర్తలు కదంతొక్కారు. ఆందోల్ మండలంలోని సంగుపేట చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. మంత్రులు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్న ఈ పాదయాత్రలో ఆద్యంతం కార్యకర్తలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించారు. పాదయాత్ర సందర్భంగా ‘జై కాంగ్రెస్ .. జై సోనియా, జై రాహుల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దారి పొడవునా వారి పాదయాత్రకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భారీ సైజుల్లో ప్లెక్సీలు, కటౌట్లు, బెలూన్లు ఏర్పాటు చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు
కట్టుబడి ఉన్నాం: పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమకు అప్పగించిందని విమర్శించారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించి రైతుల ఇళ్లల్లో పండగ వాతావరణం కల్పించిందని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ అందించామని, రేషన్‌కార్డులను పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాలో లక్ష ఉద్యోగాలు: వివేక్
కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో వివరించాలన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో డబుల్‌బెడ్‌రూంలు అందజేయలేదని కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్క వాగ్దానాన్ని పూర్తిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాబోయే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పీసీసీ నాయకులు గిరిజా షెట్కార్, సంగమేశ్వర్, రాజనర్సింహ ఫౌండేషన్ చైర్మన్ త్రిష, పటాన్‌చెరువు, నర్సాపూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, రావుల అంజిరెడ్డి, విజయారెడ్డి, మెదక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ప్రజాహితమే మా ధ్యేయం: దామోదర రాజనర్సింహ
ప్రజాహితమే తమ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జోగిపేటలోని హనుమాన్ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సోనియాగాంధీపై నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, రైతుభరోసా, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేదలకు అందించామన్నారు.