
పేదల సొంతింటి కల తీరుస్తాం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని భూమయ్య కాలనీలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులందరికీ దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఆర్థిక సహాయానికి తోడు ఉచిత ఇసుక, ప్రారంభించడానికి డబ్బులు లేని పేదలకు మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామని చెప్పారు. జూకల్ శివారులో నిర్మించిన 775 రెండు డబుల్ బెడ్‌రూం ఇళ్లను పేదలైన దివ్యాంగులు, వితంతువులు, స్థలాలు, ఇళ్లు లేని నిరుపేదలకు కేటాయించేందుకుగాను వార్డుల వారీగా లబ్ధిదారుల గుర్తింపు జరుగుతోందన్నారు. అనంతరం రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు క్రాస్ చెకింగ్ చేశాక అర్హులైన వారికి కేటాయిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను 900 ఎస్‌ఎఫ్‌టీ వరకు నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని, వ్యవసాయంకోసం 4 వీలర్ వాహనాలు కలిగిఉన్న అర్హులకు ఇళ్లను మంజూరు చేయాలని సంబంధిత మంత్రి శ్రీనివాస్‌రెడ్డిని కోరామని వెల్లడించారు.
కన్వెన్షన్ సెంటర్‌కు రూ.1.15కోట్లు
ఖేడ్ పట్టణంలోని జూకల్ శివారులోని కన్వెన్షన్ హాల్ కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, వాష్‌రూం తదితర సదుపాయాలు కల్పించేందుకు రూ.1.15 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. కన్వెన్షన్ హాల్‌ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ..పేదలు తక్కువ అద్దె చెల్లించి వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మేనేజర్ వెంకటశివయ్య, మాజీవైస్ చైర్మన్ దారం శంకర్, పండరీరెడ్డి, అర్జున్, ప్రభాకర్‌రెడ్డి, వార్డుల అధికారులున్నారు.