
ఇంటింటా జ్వర సర్వే
కంది(సంగారెడ్డి): వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ జ్వరాల సర్వేను నిర్వహిస్తున్నారు. జ్వర బాధితులను గుర్తించి వారికి ప్రత్యేక చికిత్సను అందజేస్తున్నారు. ఈ సర్వే కోసం ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, హెల్త్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లతో మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. బృందం సభ్యులు తమకు కేటాయించిన గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేక రిస్తున్నారు. మలేరియా, డెంగీ జ్వరాల పరీక్షలను అక్కడికక్కడ నిర్వహించి అవసరమైన చికిత్స అందజేస్తున్నారు. కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వచ్చే కలబ్గూర్, కలివేముల గ్రామాల్లో డెంగీ కేసులను గుర్తించి వారికి చికిత్సలు అందజేస్తున్నట్లు పీహెచ్‌సీ డాక్టర్ సాయి శంకర్ తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 9,246 మందిని సర్వే చేసి నివాస గృహాల్లోని 1,685 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న 65 మందికి వైద్య సేవలు అందజేస్తున్నారు. వీరిలో నలుగురికి డెంగ్యూ, 16 మందికి టైఫాయిడ్ జ్వరం వచ్చినట్లు గుర్తించారు. మండలంలో ఇప్పటి వరకు చికెన్ గున్యా కేసులు సర్వేలో నమోదు కాలేదని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు.
పరిశుభ్రతపై అవగాహన
వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఇళ్ల పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. ఇళ్ల ముందు మురికి నీరు నిలవకుండా చేయడం, డ్రమ్ముల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన
ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది
జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ
వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామాల్లో సర్వేలు నిర్వహించి జ్వర బాధితులను గుర్తిస్తున్నాం. పూల కుండీలు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు అధికమై రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. వర్షాకాలంలో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి. అలాగే తాజాగా, వేడి వేడిగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
–సాయి శంకర్,
కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు