
దశదిన కర్మ స్నానానికి వెళ్లి..
మిరుదొడ్డి(దుబ్బాక): దశదిన కర్మలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగింది. భూంపల్లి ఎస్‌ఐ హరీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏదుల పర్శరాములు (28) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ భార్య నవనీత, ఐదు నెలల కుమారుడితో పాటు, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కాగా పర్శరాములు పాలివారైన చుక్క పోచయ్య ఇటీవల చనిపోవడంతో గురువారం దశదిన కర్మ ఉండగా.. తోటి కులస్తులతో భూంపల్లి శివారులోని చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో దిగి స్నానం చేస్తుండగా పర్శరాములు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా మూడు గంటల పాటు గజ ఈతగాళ్లు శ్రమించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కేసు దర్యాప్తులో ఉంది.
చెరువులో మునిగి యువకుడి మృతి