
ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించాలి
ఎస్పీ పరితోశ్ పంకజ్
ఝరాసంగం/న్యాల్‌కల్ (జహీరాబాద్): ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్‌లకు పాల్పడకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. మండల కేంద్రమైన ఝరాసంగంలోని బుధవారం పోలీస్ స్టేషన్‌తోపాటు న్యాల్‌కల్ మండలంలోని హద్నూర్ పీఎస్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణను సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...ఎలాంటి కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికబద్ధంగా ప్రతీ కేసును పరిష్కరించాలన్నారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నైట్ బీట్, పెట్రోలింగ్ అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. సరిహద్దుల వద్ద తనిఖీలు తప్పనిసరిగా చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, రూరల్ సీఐ హన్మంతు, ఎస్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.