
మున్సిపాలిటీపై నిరసనల సెగ
● ఆందోళనలో జిన్నారంమండల వాసులు ● రైతులు నష్టపోతారంటున్న ప్రజలు
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారంను మున్సిపాలిటీగా మార్చాలన్న ప్రభుత్వ వైఖరిపై ఆ మండల వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీగా మార్చే ఆలోచన విరమించుకోవాలని రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిన్నారం మండలంలో గుమ్మడిదలతోపాటు గడ్డపోతారం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీగా మార్చారు. నగరానికి సరిహద్దు ప్రాంతమైన జిన్నారం మండలాన్ని సైతం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచన మండలవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ వాతావరణం గల మండలాన్ని మున్సిపాలిటీగా మార్చే ఆలోచన చేయవద్దంటూ నిరసనలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దాదాపు 80% గ్రామీణ ప్రాంతాలతో కళకళలాడే మండలాన్ని మున్సిపాలిటీ చేయడం స్వార్థ రాజకీయాలకు పరాకాష్టని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలతో పాటు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు. ఇంటి పన్నులు, వ్యాపార సంబంధిత ట్రేడ్ లైసెన్సులు తీసుకోవడంలో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని మున్సిపాలిటీ ఏర్పాటు ఆలోచన చేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
మున్సిపాలిటీకి వ్యతిరేకం..
కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామపంచాయతీలను కలుపుతూ మండలాన్ని మున్సిపాలిటీగా మార్చడం సరైంది కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంది. మేమంతా ఏకమై మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం.
– శ్రీనివాస్ గౌడ్,
బీఆర్‌ఎస్ నాయకులు, జిన్నారం
రైతులు నష్టపోతారు
జిన్నారం మండలంలో దాదాపు పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామపంచాయతీలపరంగా వ్యవసాయ ఆధారిత గ్రామాలే ఉన్నాయి. మున్సిపల్ ఏర్పాటుతో వ్యవసాయ భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తుంది. రైతన్నలకు ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– కొత్తకాపు జగన్ రెడ్డి,
బీజేపీ జిన్నారం మండల అధ్యక్షుడు

మున్సిపాలిటీపై నిరసనల సెగ

మున్సిపాలిటీపై నిరసనల సెగ