
తపాస్‌పల్లిలో అక్రమ మైనింగ్
అధికారుల అండతో దర్జాగా వ్యాపారం
కొమురవెల్లి(సిద్డిపేట): మండలంలోని తపాస్‌పల్లి గ్రామశివారులో కొందరు ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. సంబంధిత అధికారుల అండదండలతో దర్జాగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామంలోని సర్వే నం.93లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి రాయిని విక్రయిస్తున్నారు. రాయిని కట్ చేయడం కోసం అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వందలాది ట్రిప్పుల రాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా బండరాళ్లను కటింగ్ చేసిన విషయమై స్థానికుల ఆందోళనతో అధికారులు కేసులు నమోదు చేశారు. కానీ కొద్ది రోజులుగా అక్రమార్కులు తిరిగి బండరాళ్లను కట్‌చేయడం ప్రారంభించారు. స్థానికులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రస్తుతం పనులు నిలిపివేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.