ఎన్‌సీసీతో యువతకు బంగారు భవిష్యత్
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఎన్‌సీసీ ద్వారా దేశ సేవ చేయడానికి, అదే విధంగా అపార ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, యువత బంగారు భవిష్యత్‌కు పునాదులు పడుతాయని తెలంగాణ–9వ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జయంత అన్నారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ద్వారా రాత పరీక్ష లేకుండానే ప్రత్యేక ఎంట్రీ ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలతోపాటు, త్రివిధ సాయుధ దళాలు, అగ్నివీర్ వంటి ఉద్యోగాలు నేరుగా పొందవచ్చన్నారు. తద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు అయ్యే అవకాశం ఉందన్నారు. కళాశాల వాతావరణం చాలా బాగుందని, పూర్వ విద్యార్థుల (అలుమ్ని) గురించి తెలుసుకున్న కమాండింగ్ ఆఫీసర్ మరలా కళాశాల సందర్శించడానికి వస్తానని, స్పెషల్‌గా సమావేశం అవుతానని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. ఎన్‌సీసీ విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ కలిగి ఉంటారని, ఎన్నో యూనిఫామ్ ఉద్యోగాలు సాధించారన్నారు. అగ్నివీర్ ద్వారా ప్రతీ ఏడాది 10 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించారు. కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కమాండింగ్ ఆఫీసర్
లెఫ్టినెంట్ కల్నల్ జయంత
ప్రభుత్వ డిగ్రీ,
మహిళా కళాశాల సందర్శన


