రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
నారాయణఖేడ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రమాదంలోపడ్డ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ మండలం పైడిపల్లి గ్రామంలో జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్‌లో భాగంగా సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాలు, కులాలకు చెందిన పార్టీ అని అన్నారు. దేశస్వాతంత్య్రం కోసం పోరాడిన, రాజ్యాంగాన్ని రచించిన మహాత్ములపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేద వర్గాల అభ్యున్నతికి చాలా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాలకోసమే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతుందని మండిపడ్డారు. అందువల్లే కోపం వచ్చిన రాముడు అయోధ్యలో బీజేపీని గెలవకుండా చేశాడని పేర్కొన్నారు. పైడిపల్లిలో కమ్యూనిటీ భవనానికి రూ.5లక్షలు తన నిధులనుంచి ఇస్తానని ఎంపీ తెలిపారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో సీసీరోడ్లు...
సీసీ రోడ్డు, మురుగు కాల్వలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. జగన్నాథ్ పూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమ ఖేడ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ధనలక్ష్మి, టీపీసీసీ సభ్యులు కర్నెశ్రీనివాస్, యువజనకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, తాహెర్‌అలీ, వినోద్‌పాటిల్, రమేశ్ చౌహన్, పండరీరెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


