కార్మికుల వేతనాలు విడుదల చేయాలి
సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వినతి
సిద్దిపేటరూరల్: పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ.. సీఎం ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.18 వేలకు పెంచి, జీఓ నంబర్ 51ను సవరించాలన్నారు. అదే విధంగా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం బకాయి వేతనాలకు నిధులు కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో నోటికాడి ముద్దను లాక్కున్నట్లుగా ట్రెజరీలో వేసిన చెక్కులకు ఆర్థిక శాఖ డబ్బును కేటాయించకుండా నిలిపివేయడంతో తొమ్మిది నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. కుటుంబాల పోషణ భారమై కార్మికులు అప్పుల పాలవుతున్నారన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 19 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని సమ్మె నోటీస్‌ను అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేశ్, జిల్లా నాయకులు బాకీ యాదగిరి, రాజమౌళి, కనకయ్య, బాల నర్సవ్వ, అండాలు వివిధ గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.


